Pooja Khedkar Trainee IAS Officer :అధికార దుర్వినియోగానికి పాల్పడటం ద్వారా వార్తల్లో నిలిచిన శిక్షణలో ఉన్న IAS అధికారిణి పూజ ఖేద్కర్ నిర్వాకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. అధికారదర్పం కోసం తహతహలాడిన పూజ ఖేద్కర్, ఓ దొంగను వదిలిపెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేయటమే కాకుండా ఆమె కారుపై 21 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దొంగతనం కేసులో పట్టుబడిన ఓ వ్యక్తిని విడుదల చేయాలని పోలీసు ఉన్నతాధికారిపై IAS పూజఖేద్కర్ ఒత్తిడి చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి నవీ ముంబయి పోలీసులు ఫిర్యాదు చేశారు. మే 18న పన్వేల్ పోలీస్ స్టేషన్‌లోని డీసీపీ వివేక్ పన్సారేకు ఫోన్ చేసి దొంగతనం కేసులో అరెస్టయిన ఈశ్వర్ ఉత్తరవాడే అనే వ్యక్తిని విడుదల చేయాలని పూజ కోరినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరవాడేపై వచ్చిన అభియోగాలు చిన్నవే అని, అతన్ని వదిలేయాలని కోరినట్లు చెప్పారు. అయితే ఫోన్ చేసిన వ్యక్తి ఐఏఎస్ అధికారిణి అని నిర్ధరణకు రానందున నిందితుడిని విడుదల చేయలేదని పోలీసులు తెలిపారు. పూజ ఖేద్కర్ ప్రవర్తన గురించి అనేక విషయాలు వెలుగులోకి రావటం వల్ల తాము ఈ విషయాన్ని పుణె కలెక్టర్ కార్యాలయానికి నివేదించినట్లు నవీ ముంబయి పోలీసులు పేర్కొన్నారు.
తన ప్రైవేటు ఆడి కారులో ప్రయాణించే సమయంలో ఖేద్కర్ పలుమార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు పుణె ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై 21 చలాన్లు ఆమె కారుపై ఉన్నట్లు వెల్లడించారు. అందుకు రూ.27 వేలు జరిమానా కట్టాలని పూజ ఖేద్కర్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు. దివ్యాంగులకు లభించే ప్రయోజనాలు సహా ఓబీసీ కోటాను దుర్వినియోగం చేసినట్లు పూజ ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి.
పూజ నిర్వాకాలపై ప్రభుత్వం నజర్!
అంతేకాకుండా, ఐఏఎస్‌గా నియామకం కావటానికి దివ్యాంగులకు లభించే ప్రయోజనాలుసహా ఓబీసీ కోటాను దుర్వినియోగం చేసినట్లు పూజ ఖేద్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారదర్పం చాటుకునేందుకు పనిచేసే చోట ప్రత్యేక వసతులు కల్పించాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరటంపై ఫిర్యాదులు అందటం వల్ల, పూజ ఖేద్కర్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలు నిగ్గుతేల్చేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆరోపణలు నిజమని తేలితే పూజ ఖేద్కర్‌పై కఠిన చర్యలు తప్పవని ఆమెను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు ఫోర్జరీ చేసినవని తేలితే చట్టపరంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ 2 వారాల్లో నివేదిక సమర్పించనుంది.