A Politician Sleeping On Currency Notes : అసోంలో ఓ రాజకీయ నేత కరెన్సీ నోట్లపై అర్ధనగ్నంగా నిద్రించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. యూపీపీఎల్ పార్టీలో పనిచేసిన బెంజమిన్ బసుమతారీ అనే నాయకుడు 500 నోట్లపై పడుకున్న చిత్రం వైరల్‌గా మారింది. ఉదల్గురీ జిల్లాకు చెందిన బెంజమిన్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంపై పార్టీకి బెంజమిన్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పంందిచింది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ బెంజమిన్‌పై పలు కేసులున్నాయి. ఆయన విలేజ్ కౌన్సిల్ డెవలప్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై యూపీపీఎల్ పార్టీ చీఫ్ ప్రమోద్ బోరో స్పష్టత ఇచ్చారు. బెంజమిన్‌ను జనవరిలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు.
'పార్టీతో సంబంధం లేదు'
'జెంజమిన్ ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. జనవరి 10నే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. మాకు బెంజమిన్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయాలని అనుకుంటున్నా. హరిసింగ బ్లాక్ కమిటీ, యూపీపీఎల్ నుంచి జనవరి 5న లేఖ అందుకున్న తర్వాత బెంజమిన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం. ఈ కారణంగా ఫిబ్రవరి 10న విలేజ్ కౌన్సిల్ డెవలప్‌మెంట్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) సస్పెండ్ చేసింది. బెంజమిన్ బసుమతారీని యూపీఎల్ఎల్ పార్టీతో లింక్ చేసి మాట్లాడటం మానుకోవాలని అన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వినిమోగదారులను కోరుతున్నా. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటో అతని వ్యక్తిగత వ్యవహారం. దానికి పార్టీ జవాబుదారీ కాదు' అని ఎక్స్ వేదికగా ప్రమోద్ బోరో పేర్కొన్నారు.