PM Modi Underwater Metro: బంగాల్లోని కోల్‌కతాలో నిర్మించిన దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రో టన్నెల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. విద్యార్థులు, మెట్రో సిబ్బందితో ప్రధాని మోదీ కాసేపు సంభాషించారు. ప్రధాని మోదీతో మెట్రోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, ఎమ్మెల్యే సువేందు అధికారి ప్రయాణించారు.
బంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ మెట్రో టెన్నెల్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆగ్రా మెట్రో, మీరట్ మెట్రో, పుణే మెట్రో సహా దేశవ్యాప్తంగా పలు మెట్రో సేవలను ప్రధాని మోదీ కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఇదే వేదికపై కోల్‌కతాలో దాదాపు రూ. 15,400 కోట్ల రూపాయల విలువైన బహుళ కనెక్టవిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
మరో సరికొత్త రికార్డు
దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు మొదలైంది కోల్‌కతా నగరంలోనే. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు ప్రారంభంతో మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా ఈస్ట్- వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. ఈ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు. అయితే 10.8 కి.మీ. భూగర్భంలో ఉంటుంది. ఇందులో హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కి.మీ.ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రోరైలు కోల్‌కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.