PM Modi Cabinet Meeting Today :సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడే నూతన ప్రభుత్వం కోసం మొదటి 100 రోజులకు, వచ్చే ఐదేళ్ల పాలన కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధంచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ రోడ్‌మ్యాప్ రూపొందించడంలో సంబంధిత మంత్రిత్వశాఖ కార్యదర్శులు, అధికారుల సలహాలను తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన మరుసటి రోజే ఈ సమావేశాన్ని ప్రధాని నేతృత్వంలో నిర్వహించినట్లు సమాచారం. మార్చి 3న ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి వికసిత్ భారత్-2047 లక్ష్యంపై జరిపిన మేధోమథనంలోనూ ఈ అంశంపై చర్చించారు.
మరోవైపు, ఏడు దశల్లో ఎన్నికలను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు పంపడం ద్వారా ఎన్నికల ప్రక్రియను కెబినేట్ ప్రారంభించింది. ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 20న జారీ చేస్తారు. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఆ దశ పోలింగ్‌కు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.