PM Modi Kautilya Economic Conclave :ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నా భారత్ 7 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పెట్టుబడిదారులు భావిస్తున్నారని చెప్పారు. ఈ అనిశ్చితి వేళ పెట్టుబడులకు భారత్ స్వీట్ స్పాట్‌గా మారిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథాన్ని కొనసాగించే దిశగా పరివర్తన మార్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. కౌటిల్య ఆర్థిక సదస్సులో ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వ్యవస్థీకృత సంస్కరణలు అవసరం అని అభిప్రాయపడ్డారు.
పెట్టుబడులకు భారత్ స్వర్గధామం- ప్రపంచ దేశాలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం: మోదీ - PM Modi Kautilya Economic Conclave - PM MODI KAUTILYA ECONOMIC CONCLAVE
అనిశ్చితుల వేళ పెట్టుబడులకు భారత్ స్వర్గధామంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ దేశాలకు మన దేశం పట్ల ఉన్న నమ్మకానికి అది నిదర్శనమని పేర్కొన్నారు.
Published : Oct 4, 2024, 9:30 PM IST
మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగాలు, నైపుణ్యం, సుస్థిరాభివృద్ధి, వేగవంతమైన విస్తరణ వంటి అంశాలపై దృష్టి సారించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. భౌగోళిక అత్యవసర పరిస్థితులు నెలకొన్న వేళ ప్రపంచమంతా భారత్ గురించి మాట్లాడుతుందంటే ఆయా దేశాలకు మన దేశం పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. గడిచిన పదేళ్లలో చేపట్టిన సంస్కరణలే అందుకు కారణమన్నారు. ప్రపంచంలోనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని, ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నామని తెలిపారు.
అత్యధికంగా ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు తయారయ్యే దేశం మనదేనని ప్రధాని మోదీ అన్నారు. మొబైల్ ఫోన్ల తయారీలో రెండో స్థానంలో ఉన్నామన్నారు. సంస్కరించు, పనితీరు మెరుగుపరుచు, రూపాంతరం చెందు అనేది తమ ప్రభుత్వం నిత్యం పటించే మంత్రమని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసమే మన బలమని పేర్కొన్నారు. భారత అభివృద్ధి కోసం మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. గడిచిన పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం; జీఎస్టీని తీసుకురావడం; దివాలా స్మృతి; గనులు, రక్షణ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం; ఎఫ్‌డీఐ నిబంధనలు సరళీకరించడం వంటివి తమ ప్రభుత్వ విజయాలుగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.