PM Modi Varanasi Visit :భారత్ ఆరోగ్య వ్యూహాలు ఐదు స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేడు భారత్ దేశం వైద్య రంగంలో ప్రివెంటివ్ హెల్త్ కేర్, సకాలంలో వ్యాధి నిర్ధారణ, ఉచిత, చౌకమైన చికిత్స, చిన్నచిన్న పట్టణాల్లో మెరుగైన వైద్యం, వైద్యుల కొరతను భర్తీ చేయడం, వైద్యరంగంలో సాంకేతిక విస్తరణ వంటి ఐదు స్తంభాలను కలిగి ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన సొంతనియోజక వర్గంలోని వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్‌జే శంకర కంటి ఆస్పత్రిని ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.6,700 కోట్లతో పలు అభివృద్ధికి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ శంకర ఆస్పత్రి వల్ల యూపీతోపాటు మధ్యప్రదేశ్, బిహార్ రాష్ర్టాల్లోని మెుత్తం 20 జిల్లాలోని ప్రజలకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. ఈ ఆసుపత్రి రాకతో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న కాశీ, ఇకపై ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా మారుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
మోదీపై కంచి శంకరాచార్య ప్రశంసలు
ప్రధాని మోదీ నాయకత్వంపై కంచి కామకోటి పీఠం శంకరాచార్యులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసలు కురిపించారు. భగవంతుని ఆశీస్సుల వల్లే మోదీ లాంటి మంచి నేతలు వచ్చారని, ఆయన ద్వారా భగవంతుడు ఎన్నో మంచి పనులు చేయిస్తారని అన్నారు. వారణాసిలోని ఆర్‌జే శంకర్ కంటి ఆసుపత్రిని ప్రధాని ప్రారంభించిన సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడారు.