PM Kisan 17th Installment Release Date :అన్నదాతలకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటించింది. ఈ పథకం ద్వారా మొత్తం 9.3 కోట్ల మంది రైతులకులబ్ధి చేకూరనుంది. మరి ఆ డబ్బులు ఎప్పుడు పడతాయి ? స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం "ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి" పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈపథకం ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి సంవత్సరానికి 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను ఏటా మూడు విడతలుగా నేరుగా రైతుల అకౌంట్స్‌లో జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్ - జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా.. 2 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకుపీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది. ఇప్పుడు 17వ విడత నిధులు విడుదల కాబోతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో "జూన్ 18వ" తేదీన.. పీఎం కిసాన్ 17వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు చొప్పున 20వేల కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి.