People Use Ropeway to Cross River: ఉత్తరాఖండ్‌లోని టిహ్రీ గఢ్వాల్ జిల్లా పర్వత ప్రాంతంలో పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు వంతెన లేక చదువుకు దూరం అవుతున్నారు. ఆయా గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో పట్టణానికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈప్రాంతంలో మూడు రోప్‌వేలు నిర్మించినప్పటికీ, అందులో రెండు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. ఉన్న ఒకే రోప్‌వేతో ప్రమాదకరంగా నది దాటాల్సిన పరిస్థితి. దీంతో ఆ రోప్‌వేపై అధికంగా భారం పడుతుండం వల్ల ప్రజలు ప్రాణాలు చేతి అరచేతిలో పెట్టుకొని నదిని దాటుతున్నారు.
నిర్లక్ష్యం!
ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ జిల్లాలోని సక్లానా ప్రాంతంలో పర్వతాలు విస్తరించి ఉన్నాయి. పర్వతాలకు అటువైపుగా ఉన్న గ్రామాలను కలుపుతూ 1987లో సోంగ్ నదిపై అప్పటి ప్రభుత్వం వంతెన నిర్మించింది. పర్వత ప్రాంతాల మధ్యలో ఉన్న గ్రామాల నుంచి సమీప పట్టణానికి వెళ్లేందుకు అనుసంధానంగా ఉన్న వంతెన ద్వారా సుమారు 30 గ్రామాలకు రాకపోకలు సాగేవి. ఆయితే, వరదల కారణంగా ఆ వంతెన కొట్టుకుపోయింది. ఇప్పడు వంతెన లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాలకు చేరుకోవాలంటే సుదూర ప్రయాణం చేయాల్సి వచ్చేది.
రోప్‌వేనే దిక్కు!
ఈ సమస్యను అధిగమించేందుకు చిఫాల్టీ, రగ్దా గ్రామం, సౌందనా ప్రాంతాల్లో మూడు రోప్‌వేలను ఏర్పాటు చేశారు. అయితే, వాటిలో రెండు ఇప్పటికే కొట్టుకుపోయాయి. హిలాన్స్, సౌందనా గ్రామాన్ని కలిపే రోప్‌వే మాత్రమే పని చేస్తోంది. కొత్త వంతెన నిర్మాణం పనులు ప్రారంభించినా పనులు ఇంకా పుర్తి కాలేదు. దీంతో ఆయా గ్రామాలకు ట్రాలీ రోప్‌వేనే దిక్కైంది.