అజాత శత్రువుకు అత్యున్నత గౌరవం - ఎల్లప్పుడూ ప్రజలకు దగ్గరగానే వెంకయ్య Padma Vibhushan Award Venkaiah Naidu: 1949 జులై 1న నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు ముప్పవరపు వెంకయ్యనాయుడు. బుచ్చిరెడ్డిపాలెం జడ్పీ హైస్కూల్‌లో పాఠశాల విద్య, నెల్లూరు వీఆర్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో లా చేశారు. యుక్త వయసు నుంచే ఆరెస్సెస్, ఏబీవీపీలతో కలిసి పనిచేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థిసంఘం అధ్యక్షుడిగా గెలిచారు.
జై ఆంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1974లో జయప్రకాశ్ నారాయణ్ నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కన్వీనర్‌గా పనిచేశారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జైలుకూ వెళ్లారు. 1998 నుంచి 2017లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకూ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనా ప్రజలకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటున్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు.
తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేసిన వెంకయ్యనాయుడు, స్వయం కృషితో హిందీ, ఆంగ్లంలో అనర్ఘళంగా ప్రసంగించే ప్రావీణ్యం గడించారు. 3 భాషల్లోనూ హాస్యాన్ని రంగరించి ప్రసంగించడం ఆయనకు అంత్యప్రాసలతో పెట్టిన విద్య. దక్షిణాది నుంచి రాజకీయం అరంగేట్రం చేసినా ఉత్తరాది నాయకులతో సమానంగా దేశరాజధానిలో గుర్తింపుపొందిన తెలుగు తేజం వెంకయ్యనాయుడు! ఎంత ఎత్తుకు ఎదిగినా గ్రామీణ వేష, భాషలను వీడని వ్యక్తిత్వం. మాటల్లో సరళత, చేతల్లో సౌమ్యత ఆయన విశిష్టత.
వెంకయ్యనాయుడు, చిరంజీవి సహా ఐదుగురికి పద్మవిభూషణ్ పురస్కారం
సుదీర్ఘ రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప ఎవ్వరితో వ్యక్తిగత విభేదాలు లేని అజాతశత్రువు. ప్రతిపక్షాల నుంచి సైతం గౌరవం పొందిన కొద్ది మంది నాయకుల్లో వెంకయ్యనాయుడు కూడా ఒకరు. ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించిన ఆయన, పెద్దల సభకు సమయపాలనను నేర్పారు. 2019 ఆగస్టు 5వ తేదీన రాజ్యసభలో ఆర్టికల్ 370 బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైనా ఒక్కర్నీ సభ నుంచి బయటికి పంపకుండా, ఒక్క నిమిషం కూడా సభను వాయిదా వేయకుండా, అత్యంత చాకచక్యంగా సభను నిర్వహించి, సున్నితంగా ఆ బిల్లును పాస్ చేయించిన సాధకుడు.
2017 నుంచి 2022వ మధ్యకాలంలో భారత 13వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలను వెంకయ్యనాయుడు నిర్వహించారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగానూ పనిచేశారు. 2014 నుంచి 2017 వరకు మోదీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కీలకబాధ్యతలు నిర్వర్తించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సొంత రాష్ట్రానికి వీలైనంత మేలు చేసేవారు. మోదీ హయాంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే అత్యధికంగా పట్టణ పేదల ఇళ్లు మంజూరుచేసి స్వరాష్ట్రంపై ప్రేమను చాటారు.
విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, కాకినాడలను స్మార్ట్‌సిటీల జాబితాలో చేర్చి అక్కడ మౌలికవసతుల మెరుగుదలకు కేంద్రం నుంచి సాయం అందేలా చేశారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో డ్రైనేజీ సౌకర్యం మెరుగుదల కోసం రూ.వెయ్యి కోట్లు మంజూరుచేసి చేయూతనిచ్చారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలోనూ విభజన చట్టంలోని హామీల అమలు కోసం నిరంతరం అధికారులతో మాట్లాడుతూ, వాటిని సాధ్యమైనంతగా త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేశారు.
మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్
75 ఏళ్ల వెంకయ్యనాయుడుది 46 ఏళ్ల రాజకీయ జీవితం. ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్నహోదాల్లో పనిచేశారు. అనుపమాన వాగ్ధాటితో జాతీయస్థాయిలో అభిమానధనాన్ని సొంతం చేసుకున్న తెలుగునేత వెంకయ్యే. దేశంలోని అన్ని జిల్లాలనూ కనీసం ఒక్కసారైనా చుట్టేసిన బహుదూరపుబాటసారి. విద్యార్థి రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతి దాకా సుదీర్ఘకాలం దేశ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా తెలుగుతేజం ముప్పవరపు వెంకయ్య నాయుడును కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత రెండో పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌తో సత్కరించింది. అమృతకాలంలో భారతదేశం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో ప్రకటించిన పద్మవిభూషణ్‌ను వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు వెంకయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
దేశంలోని గ్రామాలు, రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఇది వారికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని వివరించారు. ఈ పురస్కారం తన బాధ్యతలను మరింత పెంచిందని, శక్తిమంతమైన ఆత్మనిర్భర నవభారత నిర్మాణం కోసం ప్రజలతో కలిసి ఆ దిశలో పయనిస్తానని తెలియజేస్తానని వెంకయ్య పేర్కొన్నారు.
Gandhi Peace Prize Venkaiah Naidu : గాంధీ శాంతి బహుమతి జ్యూరీలో వెంకయ్య.. మోదీ ఆమోదంతో..