Nitish Kumar Leaves India Bloc : లోక్‌సభ ఎన్నికల ముందు విపక్ష 'ఇండియా' కూటమికి భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మళ్లీ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బీజేపీని గద్దె దించాలన్న ఇండియా కూటమి లక్ష్యం బీటలువారనుంది. దేశంలోని కీలక రాజకీయ నేతల్లో ఒకరైన నీతీశ్ కుమార్ కూటములు మారటం, మద్దతు ఉపసంహరించుకోవడం ఇదేమి తొలిసారి కాదు. ఏ పార్టీ గెలిచినా అధికారం మాత్రం తనకే ఉండాలన్నట్లు వ్యవహరించే నీతీశ్, 2013 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు తన మిత్ర పార్టీలకు హ్యాండిచ్చారు.
1990లో అప్పటి జనతాదళ్ సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను బిహార్ ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర పోషించడంతో నీతీశ్ కుమార్ పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. అయితే 1994లో లాలూపై నీతీశ్ తిరుగుబావుటా ఎగురవేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీని ఏర్పాటు చేశారు. 2003లో ఇది శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్)లో విలీనమైంది. ఆ తర్వాత జేడీయూ అధ్యక్షుడిగా నీతీశ్‌కుమార్ ఎంపికయ్యారు. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు నీతీశ్ కుమార్.
17 ఏళ్ల బంధానికి గుడ్‌బై
బీజేపీ-జేడీయూ పార్టీలు 1998 నుంచి పొత్తులో ఉన్నాయి. అయితే 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఉంచాలన్నదానిపై ఎన్డీయేలో ప్రతిష్టంభన నెలకొంది. ఆ సమయంలో ఎన్డీయే కూటమిలో సీనియర్ నేతగా పేరున్న నీతీశ్ పేరు కూడా వినిపించింది. అయితే, ప్రధాని అభ్యర్థిగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నీతీశ్ 2013 జూన్ 16న కూటమి నుంచి తొలిసారిగా బయటకి వచ్చేశారు.
మహాఘట్‌బంధన్‌తో ప్రయాణం
2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఒంటరిగానే బరిలోకి దిగింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలను చేజిక్కించుకోలేక పోయింది. అప్పటికే బీజేపీతో వివాదాలు పెరగడం వల్ల ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి నీతీశ్‌కుమార్ మహాఘట్బంధన్ను ఏర్పాటు చేశారు. ఆ రెండు పార్టీల మద్దతుతో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కూటమిలో వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.
ఆర్జేడీకి షాకిచ్చి
బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌పై 2017లో తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో డిప్యూటీ సీఎం పదవి నుంచి వైదొలగాలని నీతీశ్ కుమార్ తేజస్వీని కోరారు. అయితే ఆర్జేడీ శాసనసభా పక్షం అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య మనస్పర్థలు వచ్చి 2017 జులై 26 తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు నీతీశ్ కుమార్. ప్రతిపక్ష బీజేపీతో జట్టుకట్టి గంటల వ్యవధిలోనే మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.