Maharashtra Assembly Polls Updates :మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీలో సీట్ల పంపకాలపై చర్చలు ముగింపు దశకు వచ్చాయి. కాంగ్రెస్, శివసేన (UBT), NCP (శరద్ పవార్ వర్గం) తలో 85 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. మొత్తంగా 270 సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరగా, మిగతా 18 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ సహా ఇతర భాగస్వామ్యపక్షాలకు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే వెల్లడించారు. సీట్ల పంపకాలపై తుది ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మహా వికాస్ అఘాడీ కూటమిగా బరిలోకి దిగి, మహాయుతి కూటమిపై విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇంకా చర్చలు కొనసాగుతున్నాయ్!
మరోవైపు 12 సీట్లు ఆశిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే 5 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. దీనిపై సమాజ్‌వాదీ పార్టీతో పాటు కూటమిలోని ఇతర పార్టీలతో చర్చలు జరిపి గురువారం నాటికి అంతా పూర్తి చేస్తామని నానా పటోలే తెలిపారు. తామంతా మహా వికాస్ అఘాడీ కూటమిగా పోటీ చేస్తున్నామని, ఎన్నికల్లో ‘మహాయుతి కూటమి’పై విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సీట్ల సర్దుబాటులో జరుగుతున్న జాప్యం పట్ల చిన్న పార్టీలు గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, లెఫ్ట్, పీడబ్ల్యూపీలు- మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉన్నాయి.