Mukhtar Ansari Death :గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ మరణంతో ఉత్తర్ప్రదేశ్ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ప్రజలు ఎక్కడా గుమికూడదని ప్రకటించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాలో అదనపు బలగాలను మోహరించారు. అన్సారీ మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసుల ఐటీ సెల్ గట్టి నిఘా పెట్టింది. అన్సారీ మృతదేహానికి శవపరీక్ష చేసి కుటుంబసభ్యులకు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.
అయితే, ముఖ్తార్ పోస్టుమార్టం కోసం న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తరఫు లాయర్ తెలిపారు. డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పోస్టుమార్టం జరుగుతుందని వెల్లడించారు. అందుకోసం పలు డాక్యుమెంట్లపై సంతకం చేయాల్సి ఉందని, అందుకే తాను అక్కడికి వచ్చినట్లు చెప్పారు. మరోవైపు, ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. గాజీపుర్లోని కాలి బాగ్ శ్మశాన వాటిలో ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్తార్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఖననం చేయనున్నారు.
'ముఖ్తార్కు స్లో పాయిజన్ ఇచ్చారు'
ముఖ్తార్ అన్సారీ గురువారం రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. అయితే ఆయన కుమారుడు ఉమర్ అన్సారీ మాత్రం తన తండ్రికి 'స్లో పాయిజన్' ఇచ్చారని ఆరోపిస్తున్నారు. రెండురోజుల క్రితం తాను ఆయన్ను కలవడానికి వెళ్లినప్పుడు అనుమతించలేదని ఉమర్ చెప్పారు.
'ఆరోగ్యం బాగలేకున్నా ఆస్పత్రి నుంచి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు. వైరల్ అయిన ఓ వీడియోలో ఆయన పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తోంది. ఆయన పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చడానికి తీసుకొచ్చారు. కానీ, 12 గంటల తర్వాత మళ్లీ జైలుకి తీసుకెళ్లారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలి. దీన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం'' అని అన్నారు. అంతకుముందు ముఖ్తార్ సోదరుడైన గాజీపుర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ సైతం ఇదే తరహా ఆరోపణలు చేయగా పోలీసులు వాటిని ఖండించారు.
సమగ్ర దర్యాప్తు జరిపించాలి : అఖిలేశ్ యాదవ్
అన్సారీ మృతి నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. జైలులో ఉన్న ఖైదీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనుమానాస్పదంగా మరణించినప్పుడు, సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని నిబంధనలు చెబుతున్నట్లు తెలిపారు. లేదంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పోతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, అఖిలేశ్ ఎక్కడా ముఖ్తార్ అన్సారీ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.
'చాలా సంతోషంగా ఉంది- ఈ రోజు మాకు హోలీ పండుగ'
ముఖ్తార్ అన్సారీ మరణంపై ఆయన చేతిలో హత్యకు గురైన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ భార్య అల్కా రాయ్ స్పందించారు. 'ఇది భగవంతుడి ఆశీర్వాదం. నేను నాకు న్యాయం చేయాలని దేవుణ్ని వేడుకునేదాన్ని. ఇప్పుడు ఆయన నాకు న్యాయం చేశారు. ఈరోజు నాకు హోలీ పండుగ వంటింది' అని ఆమె అన్నారు.
ఆరోగ్యం క్షీణించి వాంతులు చేసుకుంటున్న కారణంగా ముఖ్తార్‌ను బాందా జిల్లా జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య గురువారం రాత్రి 8.25కు ఆసుపత్రికి తీసుకువచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ కాసేపటికి మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. రెండు రోజుల కిందట కూడా రోజంతా ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందించారు.