Tejasvi Surya Triathlon Challenge : భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య మరోసారి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నారు. గోవాలో జరిగిన ఐరన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి ఎంపీగా రికార్డును సొంతం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన 1.9 కి.మీ ఈతకొట్టారు. 90 కి.మీ మేర సైక్లింగ్ చేశారు. 21.1 కి.మీ మేర రన్నింగ్ చేశారు.
ఈవెంట్‌లోని అన్ని విభాగాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు దాదాపు నాలుగు నెలల పాటు తేజస్వీ సూర్య శ్రమించారు. ఈసందర్భంగా ఆయనను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తేజస్వీ సూర్య సాధించిన ఈ ఫీట్ ఎంతోమంది యువతను ఫిట్‌నెస్ యాక్టివిటీస్ దిశగా నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీతోపాటు కేంద్రమంత్రులు అమిత్‌షా, పీయూశ్ గోయల్, మనసుఖ్ మాండవీయ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తదితరులు తేజస్వి సూర్యను అభినందించారు.
2022 సంవత్సరంలో గోవాలో జరిగిన ఈ పోటీల్లో కూడా తేజస్వి పాల్గొన్నప్పటికీ కేవలం సైక్లింగ్ విభాగాన్ని ఆయన పూర్తి చేయగలిగారు. ఈసారి జరిగిన పోటీల్లో 50కిపైగా దేశాలకు చెందిన ఔత్సాహికులతో పాటు భారత్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 120 మందికిపైగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. కాగా, ఈత, సైక్లింగ్, రన్నింగ్ ఈవెంట్స్ కలిసి ఉన్నందు వల్లే దీనికి ట్రయాథ్లాన్ అనే పేరు వచ్చింది. ఈ మూడు ఈవెంట్ల మొత్తం టార్గెట్ 70.3 మైళ్లు (113 కి.మీ). అందుకే ఈ ఈవెంట్‌కు ఐరన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్ అనే పేరు పెట్టారు. 8 గంటల 27 నిమిషాల 32 సెకన్లలో ఛాలెంజ్‌ను పూర్తిచేశారు తేజస్వి.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు తేజస్వీ సూర్య. 2,77,083 ఓట్లతో విజయం సాధించారు. అయితే బెంగళూరు సౌత్ లోక్‌సభ స్థానం 1991 సంవత్సరం నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంది. ఈ సీటు పరిధిలో జయనగర్‌తో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో బీజేపీ దిగ్గజ నేత, దివంగత కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆరుసార్లు బెంగళూరు సౌత్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2018లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన తేజస్వీ సూర్య అత్యధికంగా 7.39 లక్షల (62 శాతం) ఓట్లను పొందారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బి.కె.హరిప్రసాద్‌కు 4 లక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయి. మొత్తం మీద 3 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో తేజస్వి గెలిచారు. 2024లో కాస్త మెజార్టీ తగ్గినా తన స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకున్నారు.