Modi Photo On 2000rs Silver Note : మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పోటీలో లేకపోవడం వల్ల బీజేపీ, ఇతర అభ్యర్థులకు మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఇందౌర్‌కు చెందిన ఓ బంగారం వ్యాపారి వినూత్నంగా ఆలోచించారు. ఇందౌర్‌లో విజేత ఎవరు, మెజార్టీని అంచనా వేసిన వారికి మోదీ ఫొటోతో కూడిన రూ.2వేల వెండి నోటును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 51 మంది విజేతలకు ఈ బహుమతిని ఇవ్వనున్నట్లు చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని
ఇందౌర్‌కు చెందిన నిర్మల్ వర్మ ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. ఇందౌర్‌లో లోక్‌సభ ఎన్నికల్లో విజేత సాధించే మెజార్టీ చెప్పిన 51మందికి జాతిపిత మహాత్మా గాంధీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో ఉన్న వెండి నోటును అందించనున్నట్లు చెప్పారు నిర్మల్ వర్మ. ప్రధాని మోదీ వెండి విగ్రహాలే కాకుండా ఆయనకు సంబంధించిన పలు రకాల చిహ్నాలను తయారు చేశారు.
'ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే'
ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు(జూన్ 4) 51మంది విజేతలకు ఇందౌర్ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ బహుమతులను అందిస్తారు. ఈ పోటీని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, యువత మరింత ఎక్కువగా ఓటు వేసేలా ఉత్సాహాన్ని నింపేందుకు నిర్వహిస్తున్నట్లు బంగారు వ్యాపారి నిర్మల్ శర్మ తెలిపారు. జూన్ 4న బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ లక్కీ డ్రా తెరిచి 51మంది విజేతలను ప్రకటిస్తారని, ఆయనే విజేతలకు బహుమతులు అందిస్తారని పేర్కొన్నారు.