Modi on Swachh Bharat Mission : గత పదేళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతమైన అతి పెద్ద ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిని ప్రజలు వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి నిరంతర ప్రయత్నాల ద్వారా మనం దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని పేర్కొన్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, గోవర్ధన్ యోజనకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
'స్వచ్ఛ భారత్ కార్యక్రమం- పరిశుభ్రత ఉద్యమం మాత్రమే కాదు. ప్రజా శ్రేయస్సుకు ఇదొక కొత్త మార్గం. దేశ ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు, మత పెద్దలు, క్రీడాకారులు, సెలబ్రిటీల, స్వచ్ఛంద సంస్థలు, మీడియా అందరూ కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు నేను అభినందిస్తున్నా. మీరంతా కలిసి దీనిని ప్రజా ఉద్యమంగా మార్చారు. మాజీ, ప్రస్తుత రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమానికి సహకరించారు. ఇక స్వచ్ఛతకు సంబంధించిన రూ.10వేల కోట్లు విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మిషన్ అమృత్ ద్వారా దేశంలోని అనేక నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. నమామి గంగా పనులైతేనేమి, వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ గోవర్దన్ ప్లాంట్ల వంటి పనులు స్వచ్ఛభారత్ మిషన్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లనున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ ఎంత విజయవంతమైతే అదే స్థాయిలో దేశకీర్తి పెరుగుతుంది. 1000 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు 21వ శతాబ్దపు భారతదేశం గురించి మాట్లాడినప్పుడు కచ్చితంగా స్వచ్ఛ భారత్ మిషన్‌ను గుర్తుకు తెచ్చుకుంటారు' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.