Miss World 2024 Opening Ceremony : ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అందాల పోటీలకు ఆతిథ్యమివ్వాలని ప్రతి దేశం ఉవ్విళ్లూరుతుంటుంది. అలా ఈసారి 'మిస్ వరల్డ్' పోటీలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఈ ఏడాది భారత్‌కు దక్కింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ అందాల పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. గతంలో 1996లో తొలిసారి భారత్‌లో అందాల పోటీలు నిర్వహించారు. ఆ ఏడాది గ్రీస్ భామ ఇరెనె కిరీటాన్ని ఎగరేసుకుపోయారు.
ఇక ఈసారి దిల్లీలోని ఆశోక హోటల్లో ఫిబ్రవరి 20న ప్రారంభ వేడుకతో మొదలుకొని పలు పోటీలు నిర్వహించనున్నారు నిర్వాహకులు. మార్చి 9న ఫైనల్ జరగనుంది. ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు కనువిందు చేయనున్నారు. మన దేశం తరఫున కర్ణాటకకు చెందిన సిని శెట్టి 'మిస్ వరల్డ్' కిరీటం కోసం పోటీ పడుతున్నారు. గత విజేత కరోలినా (పోలండ్) ఈసారి ప్రపంచ సుందరికి తన స్వహస్తాలతో కిరీటం అలంకరించేందుకు సిద్ధమయ్యారు.
సిని శెట్టిపైనే అందరి దృష్టి
ఈసారి జరుగుతోన్న 71వ 'ప్రపంచ సుందరి' పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వడానికి తోడు మన దేశం తరఫున సిని శెట్టి ఈ పోటీల్లో పాల్గొంటుండడం వల్ల అందరి దృష్టీ ఆమె పైనే ఉందని చెప్పాలి. ఇలా ఈసారి తానో పోటీదారుగానే కాకుండా భారత్ అందిస్తున్న ఆతిథ్యంలో తానూ భాగమవడం తన జర్నీని మరింత ప్రత్యేకంగా మలచిందంటోందీ ఈ అందాల తార.
'120 దేశాలకు చెందిన అమ్మాయిలంతా ఇక్కడికి చేరుకోవడం, మన ఆతిథ్యాన్ని స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పోటీల్లో నేను భాగమవ్వడం ఒకెత్తయితే ఆతిథ్యంలోనూ భాగమవడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది. మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా స్ఫూర్తితోనే అందాల పోటీల్లో పాల్గొనాలన్న లక్ష్యం పెట్టుకున్నా. నిర్భయంగా, మనసు చెప్పింది చేసే ముక్కుసూటితనం ఆమె సొంతం. నాకూ నా సిద్ధాంతాల్ని నమ్ముతూ పారదర్శకంగా ఉండడమంటే చాలా ఇష్టం. జీవితంలో నేనేదీ ప్లాన్ చేసుకోను. ప్రతి సవాలునూ అవకాశంగా స్వీకరిస్తూ ముందుకు సాగుతానే తప్ప వెనకడుగు వేసే ఆలోచనే చేయను. ఇంతటి ప్రతిష్ఠాత్మక పోటీ అంటే కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. కానీ నేను కూల్‌గానే ఉన్నా.' అని అంటున్నారు సినీ శెట్టి. ఈ పోటీల్లో దేశం గర్వించే ప్రదర్శన చేస్తానంటున్నారు. ఎలాగైతే ఈ ముద్దుగుమ్మ ప్రతిసారీ తన భరతనాట్య ప్రదర్శనతో ప్రేక్షకుల్ని గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తుందో, మిస్ వరల్డ్ పోటీల వేదికపైనా అలాంటి ప్రదర్శనే చేయాలని భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.