తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.1కోటి రివార్డ్ నక్సల్ చలపతి హతం- 1000మంది భద్రతా సిబ్బందితో ఎన్​కౌంటర్ సక్సెస్​​! - CHHATTISGARH ENCOUNTER

ఛత్తీస్​గఢ్, ఒడిశా సరిహద్దుల్లో 1000 మందితో భారీ ఎన్​కౌంటర్​- కీలక మావో నేతలు హతం

Chhattisgarh Encounter
Chhattisgarh Encounter (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2025, 5:18 PM IST

  • వెయ్యి మంది భద్రతా సిబ్బంది
  • మావోల కోసం మూడు రోజులుగా వేట
  • 20 మంది నక్సలైట్లు మృతి
  • కోటి రివార్డ్ ఉన్న చలపతి హతం
  • నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బన్న షా

ఛత్తీస్​గఢ్​- ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి! మావోల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా 1000 మందికిపైగా కలిసి చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ సక్సెస్ అయింది. 20 మంది మావోయిస్టులు హతమవ్వగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఏరివేత కొనసాగుతోంది.

కీలక నేతలు హతం!
Chhattisgarh Encounter Update : ముఖ్యంగా తాజాగా జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందడం గమనార్హం. వారిలో నక్సలిజం కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్‌, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై గతంలో అలిపిరిలో జరిగిన దాడి కేసులో చలపతి కీలక సూత్రధారి. చిత్తూరు జిల్లా వాసి అయిన అతడిపై రూ.కోటి రివార్డు ఉంది.

కొన ఊపిరితో నక్సలిజం
దీంతో నక్సల్స్‌ లేని భారత్ దిశగా కీలక అడుగు పడిందనే చెప్పాలి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా అదే విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని అన్నారు. నక్సల్స్‌ లేని భారత్ దిశగా కీలక అడుగు పడిందని వ్యాఖ్యానించారు. తాజా ఎన్​కౌంటర్​ నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ అని, మన భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయంగా అభివర్ణించారు.

నిఘా వర్గాల సమాచారం ఆధారంగా!
అయితే ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్‌, నౌపాడలో నిఘా వర్గాల సమాచారం ఆధారంగా జనవరి 19 రాత్రి నుంచి ప్రత్యేక ఆపరేషన్ జరుగుతోంది. పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు కూడా ఆపరేషన్ కొనుసాగుతుండడం వల్ల మరింత మావోలు హతమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

2025లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు కాల్పుల్లో ఇప్పటి వరకు నలభై మంది నక్సలైట్లు మరణించారు. జనవరి 16న బీజాపుర్ జిల్లాలో భద్రతా దళాల చేతిలో 12 మంది నక్సలైట్లు హతమయ్యారు. ఆ తర్వాత జనవరి 16న జరిగిన కాల్పుల్లో 18 మంది మరణించారని మావోయిస్టులు అంగీకరించారు. గతేడాది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో 219 మంది నక్సలైట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అలా మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలనే కేంద్రం సంకల్పాన్ని బలోపేతం చేస్తూ భద్రతా దళాలు వరుస విజయాలు సాధిస్తున్నాయని చెప్పాలి.

ABOUT THE AUTHOR

...view details