Kerala Sexual Assault Allegations Case :మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్ హేమ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక కేరళ ప్రభుత్వానికి చేరగానే పలువురు నటీమణులు బయటకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వెల్లడించారు.
మూత్రశాలకు వెళ్లి వస్తుండగా!
నలుగురు సహచర నటులు తనను లైంగికంగా వేధించి, దూషించారని ఓ నటి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జయసూర్య కారణంగా చేదు అనుభవం ఎదురైందని తెలిపారు. మూత్రశాలకు వెళ్లి వస్తుండగా ప్రముఖ నటుడు జయసూర్య వెనక నుంచి వచ్చి తనను కౌగలించుకొని, ముద్దు పెట్టాడని ఆరోపించారు. ఆ ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని ఆమె చెప్పారు. తనతో ఉంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తానని జయసూర్య ఆ తర్వాత చెప్పాడని ఆమె వెల్లడించారు.
నివాసానికి వెళితే శారీరకంగా!
మలయాళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్వత్వం గురించి అసోసియేషన్ సెక్రటరీ ఇడవేల బాబును సంప్రదిస్తే ఇంటికి రమ్మని చెప్పాడని మలయాళీ నటి ఆరోపించారు. ఆయన నివాసానికి వెళితే శారీరకంగా వేధించాడని ఆమె ఆరోపణలు చేశారు. నటుడు, సీపీఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎం.ముకేశ్, మణియన్‌పిళ్ల రాజుపై కూడా ఆమె ఈ తరహా ఆరోపణలు చేశారు. అన్నింటినీ తట్టుకుని సినిమా కోసం పని చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి వేధింపులు మితిమీరాయని వెల్లడించారు. మలయాళం చిత్ర పరిశ్రమను వదిలి చెన్నైకు వెళ్లిపోయేలా చేశారని చెప్పారు. ఈ సంఘటన వల్ల తాను మానసికంగా ఎంతో కుంగిపోయానని, న్యాయం జరగాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. వారు చేసిన పనికి తగిన శిక్ష అనుభవించాలని ఆమె పేర్కొన్నారు.