తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వామపక్షాలకు 'డూ ఆర్‌ డై'- లోక్​సభ ఎన్నికల్లో మనుగడ కోసం పోరాటం! - lok sabha elections 2024

Lok Sabha Polls Left Parties : దేశంలో వామపక్షాల ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తప్పిన వామపక్షాలు, ఇప్పుడు అరకొర సీట్లతో నెట్టుకొస్తున్నాయి. ప్రతిపక్ష కూటమిలో భాగంగా తమకు కావాల్సిన సీట్లను పొందేందుకు కూడా శ్రమించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం లెఫ్ట్​ పార్టీల పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం.

Lok Sabha Polls Left Parties
Lok Sabha Polls Left Parties

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 8:49 AM IST

Lok Sabha Polls Left Parties : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం వల్ల ప్రధాన పార్టీలన్నీ ప్రచార సన్నాహాల్లో మునిగిపోయాయి. దేశంలో వామపక్షాల ప్రభావం రానురాను తగ్గిపోతోంది. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వామపక్షాలు, ఇప్పుడు అరకొర సీట్లతో నెట్టుకొస్తున్నాయి. ఈ లోక్‌సభలో కేవలం ఐదుగురు వామపక్ష ఎంపీలు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల కమ్యూనిస్టులకు డూ ఆర్‌ డైగా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రభావం చూపకపోతే దేశంలో వామపక్షాలు మరింత పాతాళానికి పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వంటి వామపక్ష పార్టీలు రాను రాను మరింత క్షీణిస్తున్నాయి. ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేక చతికిలపడుతున్నాయి. చివరికి సీపీఐ కూడా జాతీయ పార్టీగా హోదా కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే వామపక్షాల ప్రభావం ఇక పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ ఎన్నికలపైనే ఆశ
బీజేపీ పాగా వేయాలని చూస్తున్న కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. విపక్ష కూటమి కూడా అన్ని స్థానాలను నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. బంగాల్​లో టీఎంసీ ఒంటరి పోరాటం చేస్తోంది. 16 మంది అభ్యర్థులను ప్రకటించిన సీపీఐ, కాంగ్రెస్‌తో పొత్తు కోసం ఎదురుచూస్తోంది. 2019లో సీపీఐ ఒక శాతం కంటే తక్కువ ఓట్లను నమోదు చేసింది. కానీ ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓట్లు మూడు శాతానికి పెరిగాయి. బిహార్ అసెంబ్లీలోనూ వామపక్షాలు 16 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ ఫలితాలు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఓట్ల శాతం పెరగడం వల్ల ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని వామపక్ష నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

2009 నుంచే పతనం
ప్రస్తుత లోక్‌సభలో వామపక్షాలకు కేవలం ఐదుగురు ఎంపీలు ఉన్నారు. సీపీఐ నుంచి ముగ్గురు, సీపీఎం నుంచి ఇద్దరు ఉన్నారు. ఆరు దశాబ్దాల వామపక్ష పార్టీల చరిత్రలో లోక్‌సభలో ఇంత కనిష్ఠ స్థాయిలో సభ్యులు ఉండడం ఇదే తొలిసారి. 1990 నుంచి 2009 వరకు జాతీయ రాజకీయాల్లో వామపక్షాలు క్రియాశీలక పాత్రను పోషించాయి. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీపీఎం ప్రధానమంత్రి పదవికి కూడా చాలా సమీపానికి వచ్చింది. 2004లో సీపీఎం తరపున 43 మంది ఎంపీలు, సీపీఐ తరపున 10 మంది ఎంపీలు, ఏఐఎఫ్‌బీ, ఆర్‌ఎస్‌పీ పార్టీల తరపున ముగ్గురు చొప్పున ఎంపీలు గెలిచారు. 2009-2019 దశాబ్దంలో వామపక్ష పార్టీల పతనం వేగంగా కొనసాగింది. 2011లో బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, 2018లో త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోయాయి. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉన్న కేరళలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలు కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నాయి.

తగ్గిన ఓట్ల శాతం
1971- 2009 సీపీఎం ఓట్ల శాతం ఐదు శాతానికి పైగానే ఉంది. 2009లో లోక్‌సభ ఎన్నికల్లో 5.3 శాతం ఓట్లు రాగా, 2014లో 3.3 శాతానికి తగ్గింది. 1962 ఎన్నికల్లో సీపీఐకి 9.9 శాతం ఓట్లు వచ్చాయి. 1967లో 5 శాతానికి, 1991లో దాదాపు 2.5 శాతానికి పడిపోయింది. 2004లో సీపీఐకి కేవలం 1.4 శాతం ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో సీపీఎం 16 స్థానాల్లో గెలుపొందగా, సీపీఐ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా రెండు సీట్లు గెలుచుకుంది. 2014లో సీపీఎంకు తొమ్మిది మంది ఎంపీలు, సీపీఐ, ఆర్‌ఎస్పీలకు ఒక్కొక్కరు చొప్పున ఎంపీలు ఉన్నారు. 2019లో సీపీఎంకు కేవలం 1.75 శాతం ఓట్లు రాగా, సీపీఐకి 0.5 శాతం పైగా ఓట్లు వచ్చాయి.

ఉన్న అవకాశాలు ఇవే
కేరళ, తమిళనాడులో సిట్టింగ్‌ ఎంపీలున్న సీపీఎం, సీపీఐ పార్టీలు కాంగ్రెస్‌తో జట్టు కట్టాయి. అధికార డీఎంకే కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు రెండేసి స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీహార్‌పైనా వామపక్షాలు భారీ ఆశలే పెట్టుకున్నాయి. ఝార్ఖండ్ ముక్తి మోర్చా కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు కొన్ని సీట్లు ఆశిస్తున్నాయి. అయితే చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు తమకు కావలసిన సంఖ్యలో సీట్లను పొందేందుకు చాలా శ్రమపడాల్సి వస్తుంది. కేరళలో బీజేపీ బలపడటం కూడా వామపక్షాలకు సవాల్‌గా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో ఎల్‌డీఎఫ్‌కు 25 శాతం, యూడీఎఫ్‌కు 37 శాతం, బీజేపీకి 13 శాతం ఓట్లు వచ్చాయి. బంగాల్​లో టీఎంసీ అతిపెద్ద పార్టీగా కొనసాగుతుండగా, గత లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటడం వామపక్ష పార్టీల మనుగడకే ముప్పుగా మారింది. బంగాల్​లో కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. త్రిపురలో రెండు లోక్‌స‌భ స్థానాల‌ను బీజేపీ కైవ‌సం చేసుకుంది. ఈ సవాళ్లను అధిగమిస్తేనే వామపక్షాలు ఆశించిన మేరకు సీట్లు సాధించే అవకాశం ఉంది.

ఎన్నికల వేళ ప్రత్యర్థులపై ప్రైవేటు నిఘా- డిటెక్టివ్​ ఏజెన్సీలకు పెరుగుతున్న గిరాకీ!

ఎన్నికల కోసం 60+ఏజ్​లో పెళ్లి- లాలూ ప్రసాద్​ కోరికను కాదనలేకపోయిన మాజీ గ్యాంగ్​స్టర్​!

ABOUT THE AUTHOR

...view details