Lok Sabha Election Results 2024 :సుదీర్ఘంగా సాగిన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. 542 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలుండగా గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవం అయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 542లోక్‌సభ స్థానాలకే పోలింగ్ జరగ్గా మంగళవారం లెక్కింపు, అనంతరం ఫలితాల వెల్లడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు, ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలతో పాటు 147 శాసనసభ స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల లెక్కింపు, ఫలితాలు జూన్ 4నే వెలువడనున్నాయి.
మూడు అంచెల భద్రత
ఉదయం 8గంటల నుంచే సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు చేపడతారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత EVMలలో పోలైన ఓట్లను గణిస్తారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నేరుగా ఈవీఎంలలో పోలైన ఓట్లనే లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తారు. ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసులను మోహరించారు.
దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో 75 జిల్లాలోని 81 లెక్కింపు కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు. మహారాష్ట్రలో 48లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, 289 కౌంటింగ్ హాళ్లు, 4 వేల 309 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 14 వేల 507 మంది సిబ్బంది ఓట్లు లెక్కిస్తారని అధికారులు వివరించారు. తమిళనాడులోని 39 లోక్‌సభ సీట్లకు పోలైన ఓట్లను 39 కేంద్రాల్లో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాలకు 52 జిల్లాల్లో కౌంటింగ్‌కు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. కర్ణాటకలోని 28 లోక్‌సభ సీట్లకు పోలైన ఓట్లను 29 కేంద్రాల్లో లెక్కించనున్నారు. 13 వేల మంది సిబ్బంది పాల్గొనున్నారు. గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవం కావడం వల్ల 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. 26 కేంద్రాల్లో ఓట్లు గణించనున్నారు. కేరళలోని 20 లోక్‌సభ స్థానాల ఓట్లను 20 కేంద్రాల్లో లెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అసోంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్లను 52 కేంద్రాల్లో లెక్కించనున్నారు. పంజాబ్‌లో 13 లోక్‌సభ స్థానాల ఓట్లను లెక్కించేందుకు 27 ప్రాంతాల్లోని 48 భవనాల్లో 117 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.