Lok Sabha Election 2024 Date ECI : లోక్‌సభ ఎన్నికల తేదీపై వచ్చిన వార్తలపై స్పష్టత ఇచ్చింది దిల్లీ ఎన్నికల సంఘం. 2024 ఏప్రిల్ 16న లోక్సభకు ఎన్నికలు అంటూ తాము ఇచ్చిన తేదీ తాత్కాలికేమనని వెల్లడించింది. ఎన్నికలకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలను పూర్తి చేసేందుకు ఆ తేదీని ఓ లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేసింది.
"లోక్‌సభ ఎన్నికల కోసం ముందుగా అనేక పనులు ఉంటాయి. వీటన్నింటిని పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ తాత్కాలిక తేదీని నిర్ణయిస్తుంది. దీనికి అనుగుణంగా మిగిలిన కార్యక్రమాల ప్రారంభ, ముగింపు తేదీలు నిర్ణయించుకుని ఎన్నికల కార్యకలాపాలను పూర్తి చేస్తాం. వీటిలో అధికంగా జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ క్రమంలోనే 2024 ఏప్రిల్ 16న తాత్కాలిక తేదీగా నిర్ణయిస్తూ 2024 జనవరి 19న ఉత్తర్వులు జారీ చేశాం. ఈ తేదీ పూర్తిగా లోక్‌సభ ఎన్నికల ముందస్తు ప్రణాళిక కోసం మాత్రమే. కేవలం ఎన్నికల అధికారుల ఒక సూచనగా జారీ చేశాం. లోక్‌సభ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం సరైన సమయంలో ప్రకటిస్తుంది."