Law Commission On NRI Marriages :ఎన్ఆర్ఐలకు, భారత పౌరులకు మధ్య జరిగే వివాహాల్లో అనేక మోసపూరిత ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని లా కమిషన్ సిఫార్సు చేసింది. ఇటీవలి కాలంలో ఎన్ఆర్ఐల మోసపూరిత వివాహాల సంఖ్య పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని సిఫార్సు చేసింది. ఎన్ఆర్ఐలతో పాటు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) పరిధిలోకి వచ్చే వారికి భారత పౌరులతో జరిగే వివాహాలను సైతం ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని లా కమిషన్ సూచించింది.
"భారత పౌరులైన వ్యక్తులతో ఎన్ఆర్ఐలకు జరిగిన వివాహాల్లో అనేక మోసాలు వెలుగు చూస్తున్నాయి. చాలా కేసుల్లో ఈ పెళ్లిళ్లు మోసపూరితమైనవని నివేదికలు చెబుతున్నాయి. భారత్కు చెందిన తమ భార్యలను కొందరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో వదిలేయడం ఆందోళన కలిగిస్తోంది."
-విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థీ, లా కమిషన్ ఛైర్మన్
ఈ చట్టంలో విడాకులు, భాగస్వామికి భరణం, పిల్లల కస్టడీ, వారి మెయింటెనెన్స్కు సంబంధించిన నిబంధనలు ఉండాలని లా కమిషన్ పేర్కొంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సమన్లు/ వారెంట్లు జారీ చేయడం, న్యాయపరమైన పత్రాలు పంపించడానికి సంబంధించిన నిబంధనలు సైతం ఉండాలని స్పష్టం చేసింది. ఎన్ఆర్ఐ/ఓసీఐలకు భారత పౌరులకు జరిగే వివాహాల రిజిస్ట్రేషన్ కచ్చితంగా ఇండియాలోనూ నమోదు చేయించాలని సిఫార్సు చేసింది.