Kerala Landslide Frantic Phone Calls : 'ప్లీజ్ సాయం చేయండి, మా ఇల్లు కొట్టుకుపోయింది. మా నశీన్(కుటుంబ సభ్యురాలు) బతికుందో లేదో తెలియట్లేదు. ఆమె బురదలో చిక్కుకుపోయింది. మా ఇల్లు ఈ టౌన్లోనే ఉంది' అంటూ ఫోన్లో ఓ మహిళ ఆర్తనాదం.
ఇదొక్కటే కాదు, తమను కాపాడండి అంటూ చేసిన ఈ ఫోన్ కాల్స్‌లో, బాధితులు ఏడుస్తూ భయంభయంగా తమ దయనీయ పరిస్థితిని ఎదుటి వారికి వివరించే ప్రయత్నం చేశారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు సృష్టించిన బీభత్సానికి ఇలా అనేక మంది సహాయం కోసం దయనీయంగా ఎదురుచూస్తున్నారు. నేలమట్టమైన ఇళ్లలో ఇరుక్కుపోయిన తమ వాళ్లను కాపాడాలంటూ ఎంతోమంది ఇతరులకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఈ కాల్స్‌ను కొన్ని కేరళ టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి.
"ఎవరైనా రండి, మమ్మల్ని కాపాడండి. కొండచరియల కింద ఇళ్లలో మా వాళ్లు నలిగిపోయారు" అని కొందరు తీవ్ర ఆవేదనతో చెప్పడం ఆ కాల్స్‌లో స్పష్టంగా వినిపిస్తోంది. "కనీసం ఊరిని వదిలి బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కొండచరియలు విరిగిపడటం వల్ల వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి" అని మరో వ్యక్తి ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చాడు. కొండచరియలు విరిగిపడి, వరద పోటెత్తడం వల్ల రెస్క్యూ టీమ్స్ సకాలంలో బాధిత ప్రాంతాలకు చేరుకునే పరిస్థితి లేకుండాపోయిందని తెలుస్తోంది.
'ఇంకా భూప్రకంపనలను ఫీలవుతున్నాం'
చూరల్ మల పట్టణానికే చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి.. "మా ఊరిలో ఇంకా భూప్రకంపనలను ఫీలవుతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఊరంతా బాధిత కుటుంబాల ఆర్తనాదాలతో మిన్నంటుతోంది. ఊరి నుంచి బయటకొచ్చేందుకు దారులు కూడా సరిగ్గా లేవు" అని చెప్పాడు.
'నా భార్య ఆచూకీ తెలియడం లేదు'
"అకస్మాత్తుగా కొండ చరియలు విరిగిపడి వినాశనాన్ని కలిగించాయి. కొండ చరియల ధాటికి మా ఇల్లు కూలిపోయింది. నన్ను ఎవరో కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికీ నా భార్య ఆచూకీ తెలియడం లేదు. మెప్పాడి ఏరియా నుంచి ఎవరైనా వాహనాల్లో మా ఊరికి వస్తే వందలాది మంది ప్రాణాలను కాపాడగలుగుతారు" అని ముందాక్కై గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్ కాల్‌లో గోడును వెళ్లబోసుకున్నాడు.
బండరాళ్లను బలంగా పట్టుకొని.. ప్రాణాలు నిలుపుకొని
కొండచరియలు విరిగిపడ్డాక, ముందాక్కై గ్రామంలోకి వరద నీరు పోటెత్తింది. ఈ వరదల్లో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. అతడు గల్లంతయ్యాడని అందరూ భావించారు. కానీ సదరు యువకుడు జీవించే ఉన్నట్లు గుర్తించారు. వరదలో కొట్టుకుపోయే క్రమంలో అతడు- రెండు బండరాళ్ల మధ్యకు చేరాడు. దీన్ని అదునుగా భావించిన ఆ యువకుడు, వాటిని బలంగా పట్టుకున్నాడు. తద్వారా బలమైన వరద ప్రవాహంలోనూ కొట్టుకుపోకుండా తనను తాను కాపాడుకోగలిగాడు. అయితే అతడు చిక్కుకున్న ప్రాంతంలో భారీగా బురద ఉండటం వల్ల ఈతకొట్ట లేని స్థితిలో అక్కడే ఇరుక్కుపోయి ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలను కేరళ టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. ప్రస్తుతం సదరు యువకుడు ఉన్న ప్రాంతానికి రెస్క్యూ టీమ్స్ కూడా చేరుకోలేని విధంగా మార్గం మధ్యలో వేగంగా వరదనీరు ప్రవహిస్తోంది.
కేరళలో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు బీభత్సం సృష్టించాయి. కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని ముందాక్కై, చురల్మల, అట్టా మల, నూల్‌పుళ సహా పలు ప్రాంతాలపై మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.