Kejriwal Political Strategy: సీఎం పదవికి 48గంటల్లో రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించటం వల్ల దిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేజ్రీవాల్ రాజీనామాతో దిల్లీ రాజకీయాలపై ఎంత ప్రభావం ఉంటుందనే చర్చ సర్వత్రా మొదలైంది. ఆప్ జాతీయ సమన్వయకర్త నిర్ణయంతో ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీ పీఠం ఎక్కటమో లేదా నష్టపోవటమో ఏదో ఒకటి ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆయనస్థానంలో ఆప్ నుంచి మరొకరు సీఎం పగ్గాలు చేపడతారు. ఒకవేళ ఆయన ముందస్తు ఎన్నికలకు వెళితే మహారాష్ట్రతోపాటు దిల్లీ శాసనసభకు నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది. కేజ్రీవాల్ రాజీనామా తర్వాత ఆప్ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లే సూచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముందస్తు ఎన్నికలు కోసమేనా?
తమ పార్టీని చీల్చాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ వాదనను బలంగా తీసుకెళ్లాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా ప్రజల్లో సానుభూతి సంపాదించి దిల్లీ శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్నది ఆయన లక్ష్యం కావొచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తే తమపై అక్రమకేసులు బనాయించి జైల్లో పెట్టారనే వాదన పెద్దగా ప్రభావం చూపదన్న అంచనాతోనే కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికల అంశాన్ని తెరమీదకు తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆయన ఈ వ్యూహం ఫలిస్తే ఆప్ మూడోసారి అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
అంతా సులభమేమి కాదు!
అయితే ఈ రాజీనామా వల్ల లాభమే కాదు నష్టం వాటిల్లే ప్రమాదం కూడా పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం పదవిని వేరేవారికి ఇస్తే పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఎన్నికల ముందు కేజ్రీవాల్‌కు పెద్ద సవాల్‌గా మారటమే కాకుండా విపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇతర నేతలకు పదవి ఇచ్చిన తర్వాత వారి నుంచి తిరిగి బాధ్యతలు తీసుకోవటం అంత సులభం కాదని బిహార్, ఝార్ఖండ్ రాజకీయ ఉదంతాలతో అర్థమవుతుంది. రాజకీయ కారణాలతో జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతను జితన్ రామ్ మాంఝీకి అప్పగించారు. ఆ తర్వాత మళ్లీ సీఎం పదవి చేపట్టేందుకు ఆయన నానా తంటాలుపడాల్సి వచ్చింది. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ కావటంతో ఆ బాధ్యతలు చంపయీ సోరెన్‌కు అప్పగించారు. బెయిలుపై విడుదలైన ఆయన తిరిగి సీఎం పదవి చేపట్టారు. దీంతో అసంతృప్తికి గురైన చంపయీసోరెన్ జేఎంఎంకు రాజీనామా చేసి బీజేపీ పంచన చేరారు. అలాంటి పరిస్థితులు ఆప్‌నకు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.