Kejriwal Issue Order From Jail: మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన సాగిస్తున్నారు. ఈడీ లాకప్ నుంచి దిల్లీ సీఎం తొలిసారి అధికారిక ఆదేశాలను జారీ చేశారు. దేశ రాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి ఈ ఉత్తర్వులను కేజ్రీవాల్ జారీ చేసినట్లు దిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని నీటి పారుదల శాఖ మంత్రి అతిషికి నోట్ ద్వారా తెలిపినట్లు పేర్కొన్నాయి.
ముఖ్యమంత్రి జైలులో ఉండి తనకు ఆదేశాలు జారీ చేయటం బాధగా అనిపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దిల్లీ ప్రజల గురించి ఎలా ఆలోచించగలుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ జారీ చేసిన ఉత్తర్వులను ఆమె చదివి వినిపించారు. 'దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీరు, మురుగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నేను తెలుసుకున్నాను. ఈ విషయం గురించి నేను ఆందోళన చెందుతున్నాను. నేను జైలులో ఉన్నందున ఎలాంటి సమస్యలను ప్రజలు ఎదుర్కొకూడదు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి. ప్రజలను ఇబ్బందులు కలగకుండా అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేయాలి' అని కేజ్రీవాల్ తెలిపినట్లు ఆతిశీ పేర్కొన్నారు.
కట్టుదిట్టమైన భద్రత
మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆప్ మద్దుతుదారులు ఐటీఓ వద్ద నిరసన చేపట్టారు. ఆదివారం దేశ రాజధానిలో ఆప్ నేతల నిరసన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారుల పేర్కొన్నారు. ఆప్ మద్దుతుదారులు కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా క్యాండిల్ మార్చ్‌ను చేపట్టి బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయాలని నిర్ణయించుకున్నట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భద్రతను పెంచామని అన్నారు. దిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా సెంట్రల్ దిల్లీలోని బీజేపీ ఆఫీస్, ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులను మూసివేసినట్లు పోలీసులు తెలిపారు.
గవర్నర్ అనుమతి తప్పనిసరి
ఒక వేళ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసినా, ఆయనే సీఎంగా కొనసాగుతారనీ అవసరమైతే జైలు నుంచే పాలన సాగిస్తారని ఇప్పటికే దిల్లీ మంత్రులు స్పష్టం చేశారు. ఇందుకు చట్టపరంగా ఏ విధమైన అడ్డంకులు లేవు. ఐతే జైలు నిబంధనలు దీనిని అవరోధాలుగా నిలుస్తాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒక ఖైదీకి స్నేహితులు, కుటుంబీకులు, ఇతర వ్యక్తులతో వారానికి 2 సార్లు సమావేశమయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. కేజ్రీవాల్‌ను గృహ నిర్బంధం చేస్తే ఆయనకు పాలన సులభతరం అవుతుందని, ఐతే అలా చేసేందుకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సెనా అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే, గతంలో కేజ్రీ, సక్సెనాకు మధ్య అనేక వివాదాలు జరగడం వల్ల ఆయన అనుమతిపై సందిగ్ధం నెలకొంది. కాగా కేజ్రీవాల్ ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయకపోవడాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. ఆయనను తొలగించేందుకు న్యాయపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం.