Kejriwal ED Supreme Court : దిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు స్వల్ప ఊరట లభించింది! లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. మే 7న ఈడీ తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉండాలని అడిషినల్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈమేరకు స్పష్టం చేసింది.
'పిటిషన్ విచారిస్తాం- బెయిల్ ఇవ్వడం లేదు'
'ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణను పరిశీలిస్తాం' అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. దీనిపై స్పందించిన ఈడీ తరఫు న్యాయవాది అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు, మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తాము వ్యతిరేకిస్తామని కోర్టుకు చెప్పారు. దాంతో మరింత స్పష్టతనిచ్చిన ధర్మాసనం 'కేవలం పిటిషన్‌ను మాత్రమే విచారిస్తాం, బెయిల్ ఇస్తామని చెప్పడం లేదు. చివరకు బెయిల్ ఇవ్వొచ్చు, ఇవ్వకపోవచ్చు' అని చెప్పింది. ఇందుకు సంబంధించి వాదనల కోసం సిద్ధమై మే7న రావాలని ఈడీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.