Kavali Road Accident Today at Musunuru Toll Plaza: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. శనివారం తెల్లవారుజామున కావలి వద్ద రెండు లారీలు, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ముసునూరు టోల్ ప్లాజా వద్ద గేదెల లోడుతో ఆగి ఉన్న లారీని, మరో లారీ వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆగి ఉన్న లారీ బోల్తా పడింది. వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన లారీ నియంత్రణ కోల్పోయి డివైడర్ అవతలి వైపు వస్తున్న ప్రైవేటు బస్సును ఎదురుగా ఢీకొట్టింది. దీంతో అక్కడ భీకర ప్రమాద వాతావరణం నెలకొంది. ప్రమాద సమయంలో ప్రైవేటు బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నట్లు వివరించారు.
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 12మందికి గాయాలు
బస్సులో ఉన్న ప్రయాణికులు అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోగా ప్రమాదం జరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద దాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో మృతులతో పాటు మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి, నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.