Jharkhand Hemant Soren Swearing In Ceremony : ఝార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత, హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో గురువారం సాయంత్రం ఘనంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.
ఇండియా కూటమి నేతలు హాజరు
హేమంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా తదితర ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు.
నాలుగోసారి సీఎంగా హేమంత్ ప్రమాణం
ఇప్పటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన హేమంత్ సోరెన్- తాజాగా నాలుగో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు హేమంత్.
ఆమెతో కలిసి విజయతీరాలకు!
ఐదు నెలల అనంతరం జైలు నుంచి విడుదలయిన ఆయన, మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ప్రజల్లో నమ్మకాన్ని కూడగట్టుకునేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించారు. తన సతీమణి కల్పనా సోరెన్‌తో కలిసి విస్తృతంగా ప్రచారం చేపట్టి పార్టీని విజయ తీరాలకు చేర్చారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ భారీ విజయం సాధించింది. రాష్ట్రంలో 81 స్థానాలుండగా, జేఎంఎం 34 చోట్ల విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ 21 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు, ఆర్జేడీ 4 సీట్లు సొంతం చేసుకున్నాయి. సీపీఐ (ఎంఎల్) రెండు, ఏజేఎస్‌యూపీ, లోక్ జనశక్తిపార్టీ (రాం విలాస్), జేఎల్‌కేఎం, జేడీయూ చెరో ఒక స్థానం చొప్పున గెలుచుకున్నాయి. దాంతో జేఎంఎం నేతృత్వంలోని కూటమి రాష్ట్రంలో తాజాగా కొలువుదీరింది.