Jharkhand Train Accident: దేశంలో రైలు ప్రమాదాలు సహజంగా మారిపోతున్నాయని, ఎన్ని ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడదా అంటూ మోదీ సర్కార్‌పై బంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఝార్ఖండ్‌లోని చక్రధర్‌పుర్‌లో జరిగిన హావ్‌డా - ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై స్పందిస్తూ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
'హావ్‌డా-ముంబయి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో కొందరు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. దేశంలో ప్రతివారం ఏదొక రైలు ప్రమాదం జరగడం సర్వసాధారణమైంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడదా? ఇంకెంత కాలం వీటిని సహించాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నా.' అంటూ మోదీ సర్కార్‌ను మమతా బెనర్జీ ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లేప్రమాదాలు
మరోవైపు కేంద్ర రైల్వే మంత్రి ఒక ఫెయిల్ మినిస్టర్ అని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. 'రెండు నెలల్లోనే మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 17మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరో 100 మంది వరకు గాయపడ్డారు' అని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. 'దేశంలో రైల్వేలను అభివృద్ధి చేసినట్లు ప్రధాని మోదీ గొప్పలు చెబుతున్నారు కానీ, ప్రమాదాలు మాత్రం అగడం లేదు' అని కాంగ్రెస్ ప్రచార విభాగ ప్రతినిధి పవన్ ఖేడా అన్నారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రైల్వే శాఖ
ఝార్ఖండ్‌లోని చక్రధర్‌పుర్‌లో మంగళవారం తెల్లవారుజామున 3:45గంటల ప్రాంతంలో హావ్‌డా-ముంబయి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైలుకు చెందిన 18 బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు.
ప్రమాదం నేపథ్యంలో హావ్‌డా-టిట్లాగఢ్-కాంటాబాంజీ ఇస్పత్ ఎక్స్‌ప్రెస్, హావ్‌డా-బార్బిల్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి కొంతదూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు ప్రమాదాలూ ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని చెప్పారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన చోట ప్రమాద తీవ్రతను అంచనా వేయాల్సి ఉందన్నారు.
పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ ట్రైన్- ముగ్గురు మృతి, 33 మందికి గాయాలు - Train Accident Today
మిగతా బోగీలతో గమ్యం చేరిన కాంచనజంగా- బంగాల్ రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశం - Bengal Train Accident