Jaishankar Comments On Katchatheevu Issue :లోకసభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కచ్చతీవు వ్యవహారం రాజకీయకంగా పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. కచ్చతీవు అంశం అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి కాంగ్రెస్ ప్రధానులు సముద్ర సరిహద్దు ఒప్పందంలో భాగంగా 1974లో శ్రీలంకకు ఇచ్చిన కచ్చతీవును "చిన్న ద్వీపం" లేదా "చిన్న రాయి" అని పిలిచేవారని తెలిపారు. దీనికి ప్రాముఖ్యతే లేదని భావించి అప్పటి ప్రధానులు దీనిని వదిలించుకోవాలనుకున్నారు. కాగా, ఈ అంశం తరచుగా పార్లమెంటులో ప్రస్తావనకు వస్తోందని చెప్పారు. కేంద్రం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వనికి మధ్య నిత్యం ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని, కనీసం 21 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రికి సమాధానం ఇచ్చానని విలేకరుల సమావేశంలో జైశంకర్ చెప్పుకొచ్చారు.
'నాటి పాలకులు ఉదాసీనంగా వ్యవహరించారు'
కచ్చతీవు ద్వీపాన్ని అప్పగించేటప్పుడు తమను సంప్రదించలేదని డీఎంకే చెప్పడాన్ని తప్పుబట్టారు మంత్రి జైశంకర్. డీఎంకే ఒప్పందానికి వ్యతిరేకంగా బహిరంగంగా వ్యవహరించడంపై స్పందిస్తూ, 1974లో తొలిసారిగా భారత్, శ్రీలంకల మధ్య కుదిరిన ఒప్పందం గురించి అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధికి పూర్తి సమాచారాన్ని కేంద్రం అందించిందని పేర్కొన్నారు.
"వాస్తవమేంటంటే కచ్చతీవు ద్వీపానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంది. దీనిని ఎవరు చేశారనేదే కాకుండా, ఎవరు దాచారనేదీ ఇప్పుడే మాకు తెలిసింది. దీనిపై ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి."
- జైశంకర్, విదేశాంగ మంత్రి
6184 మంది మత్స్యకారుల నిర్బంధం!
1974 తరువాత ఈ పరిస్థితిని సృష్టించడానికి డీఎంకే, నాటి ప్రధానులు భారత భూభాగంపై ఉదాసీనంగా వ్యవహరించారని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 20ఏళ్లలో 6,184 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక నిర్బంధించిందని, వారికి చెందిన 1175 నౌకలను పొరుగు దేశం స్వాధీనం చేసుకుందని జైశంకర్ చెప్పారు.
వాస్తవాలు తెలియాలనే ఇలా మాట్లాడుతున్నా : మంత్రి జైశంకర్
భారతీయ మత్స్యకారులను విడుదల చేసేలా కృషి చేస్తున్నామని, ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జైశంకర్ చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కానీ, ఈ అంశంపై తమిళనాడు ప్రజలను చాలాకాలంగా తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ విషయానికి సంబంధించి వాస్తవాలను ప్రజలకు తెలియాజేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ విధంగా మాట్లాడుతున్నానని జైశంకర్ పేర్కొన్నారు.