Panasakaya Biryani Making Process:బిర్యానీ అంటే అందరికీ నాన్ వెజ్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ.. పనసకాయతో కూడా అద్దిరిపోయే దమ్ బిర్యానీ తయారు చేయొచ్చని మీకు తెలుసా? పేరుకు వెజిటేరియన్ వంటకం అయినా.. టేస్ట్ మాత్రం నాన్‌వెజ్ తరహాలో ఉంటుంది. మరి, ఈ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
మసాలా పేస్ట్ కోసం..
- మిరియాలు - 1 టేబుల్ స్పూన్
- యాలకులు - 6
- లవంగాలు - 6
- అనాసపువ్వు - 2
- దాల్చిన చెక్క - 1 ఇంచ్
- జాపత్రి - 1
- సోంపు - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- బిర్యానీ ఆకు -1
- పత్తర్ ఫూల్ - 1
- అల్లం - 1 ఇంచ్
- వెల్లుల్లి - 7
సండే స్పెషల్ - నోరూరించే ప్రాన్స్ బిర్యానీ! ఇలా చేశారంటే మళ్లీ మళ్లీ తినడం పక్కా!
బిర్యానీ కోసం..
- పనసకాయ ముక్కలు - 300 గ్రాములు
- డబుల్ బీన్స్ - 1 cup
- 2.5 cups బాస్మతి బియ్యం
- పనసకాయ ముక్కలు వేపడానికి నూనె - 4 టేబుల్ స్పూన్లు
- బిర్యానీకి నూనె - అర కప్పు
- యాలకులు - 3
- దాల్చిన చెక్క - 1 ఇంచ్
- జీలకర్ర - 1 టీస్పూన్
- లవంగాలు - 4
- అనాస పువ్వు - 1
- సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు - పావు కేజీ
- పచ్చిమిర్చి చీలికలు - 4
- టమాటా ముక్కలు - పావు కప్పు
- పుదీనా తరుగు - గుప్పెడు
- కొత్తిమీర తరుగు - గుప్పెడు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - అర టీస్పూన్
- కారం- సరిపడా
- నీళ్లు - 50 ml
- పాలు - అరకప్పు
- చిలికిన పెరుగు - అరకప్పు
- వేడి నీళ్లు - 5 కప్పులు
- నెయ్యి - పావు కప్పు
- నిమ్మకాయ - 1
తయారీ విధానం:
- ఉదయం పూట బిర్యానీ చేసుకోవాలనుకుంటే.. డబుల్ బీన్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. సాయంత్రానికి చేసుకుంటే ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుంది.
- ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి ఓ గంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే పనస ముక్కలను కూడా మజ్జిగలో నానబెట్టుకుంటే ముక్కలు నల్లగా మారకుండా ఉంటాయి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మసాలా పేస్ట్ కోసం చెప్పిన పదార్థాలు(మిరియాలు, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, సోంపు, జీలకర్ర, ధనియాలు, బిర్యానీ ఆకు) వేసి ఓ రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత పత్తర్ ఫూల్ వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఆ మసాలా దినుసులను మిక్సీజార్‌లోకి తీసుకుని అందులోకి అల్లం, వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ పట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే పాన్‌లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. అది వేడెక్కాక పనసకాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపి తీసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, జీలకర్ర వేసి వేపుకోవాలి.
- ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక నానబెట్టిన డబుల్ బీన్స్ వేసి మెత్తగా అయ్యేదాక ఓ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత టమాట ముక్కలు, పుదీనా, కొత్తిమీర తరుగు, పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు, ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్, 50 ml నీరు పోసి.. నూనె పైకి తేలేదాక వేయించుకోవాలి.
- ఇప్పుడు పనసకాయ ముక్కలు వేసి ఓ సారి కలిపి ఆ తర్వాత చిలికిన పెరుగు, పాలు కలుపుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ రసం వేసి నూనె పైకి తేలేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలి.
- ఓ 5 నిమిషాలు.. అంటే నూనె పైకి తేలిన తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి మెతుకు విరగకుండా నెమ్మదిగా మసాలాలు బియ్యానికి పట్టేలా కలుపుకోవాలి.
- ఆ తర్వాత బియ్యంలో వేడి వేడి నీళ్లు పోసి కలిపి మూతపెట్టి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
- 10 నిమిషాల తరువాత బిర్యానీ 80% కుక్ అయిపోతుంది. అప్పుడు నెమ్మదిగా గరిటెతో ఓ సారి కలుపుకోవాలి. ఆ తరువాత నెయ్యి వేసి మూతపెట్టేయాలి.
- ఇప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసి దాని మీద అట్ల పెనం పెట్టి, దాని మీద బిర్యానీ గిన్నె ఉంచి స్టవ్ సిమ్‌లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 30 నిమిషాలు కదపకుండా వదిలేయాలి. అంతే ఎంతో టేస్టీ అయినా పనసకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది.
- ఈ స్పైసీ బిర్యానీ చల్లని రైతాతో చాలా రుచికరంగా ఉంటుంది.
సండే ధమాకా - కీమా బిర్యానీ ఇలా ట్రై చేయండి! అద్దిరిపోద్ది!
సండే ధమాకా.. హైదరాబాదీ బిర్యానీ.. ట్రై చేయండిలా..!