Indian Coast Guard General Passed Away : భారత కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ (59) కన్నుమూశారు. గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కోస్ట్‌గార్డ్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నైకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు వచ్చిన పాల్‌కు గుండె పోటు వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు రాకేశ్ పాల్‌ను రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన పార్థివదేహాన్ని దిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే రాకేశ్ పాల్ మరణించిన వార్త తెలుసుకున్న రాజ్‌నాథ్ సింగ్ ఆస్పత్రికి చేరుకున్నారు. పాల్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అంజలి ఘటించారు.
"ఈ రోజు చెన్నైలో ఇండియన్ కోస్ట్‌గార్డ్ డీజీ శ్రీ రాకేశ్ పాల్ అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన సమర్థుడైన, నిబద్ధత కలిగిన అధికారి. ఆయన నాయకత్వంలో సముద్ర భద్రతను పటిష్ఠం చేయడంలో భారత్ ప్రగతిని సాధిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి" అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
అయితే రాకేశ్ పాల్ 34 ఏళ్లపాటు దేశానికి సేవలు అందించారు. కోస్ట్ గార్డ్ రీజియన్ (నార్త్ వెస్ట్) కమాండర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (పాలసీ అండ్ ప్లాన్స్), దిల్లీలోని కోస్ట్‌గార్డ్ ప్రధాన కార్యాలయంలో అదనపు డైరెక్టర్ జనరల్ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సమర్థ్, విజిత్, సుచేత కృపలానీ, అహల్యాబాయి, సీ-03 తదితర భారత కోస్ట్‌గార్డ్ నౌకలకు నేతృత్వం వహించారు. ఆయన పర్యవేక్షణలో ఐసీజీ అనేక ఆపరేషన్‌లు చేపట్టింది. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. గత ఏడాది జులై 19వ తేదీన ఇండియన్ కోస్ట్ గార్డ్ 25వ డైరెక్టర్ జనరల్‌గా రాకేశ్ పాల్ బాధ్యతలు చేపట్టారు. పదవీ చేపట్టిన ఏడాదికే గుండెపోటుతో హాఠాన్మరణం చెందారు.