India Alliance West Bengal TMC :ఇండియా కూటమికి బంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. బంగాల్‌లో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. దేశంలోని ఇతర స్థానాల్లో సీట్ల పంపకాల మాట ఎలా ఉన్నప్పటికీ, బంగాల్లోని 42 సీట్లలో మాత్రం ఒంటరిగానే బీజేపీని తాము ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాతే పాన్ ఇండియా కూటమి గురించి ఆలోచిస్తామని తేల్చి చెప్పారు. అయితే తాము ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నామని అన్నారు.
'కాంగ్రెస్ పార్టీతో నేను ఎలాంటి చర్చలు జరపలేదు. బంగాల్‌లో టీఎంసీ ఓ సెక్యులర్ పార్టీ. రాష్ట్రంలో ఒంటరిగానే బీజేపీని ఓడిస్తాం. వారికి మేం చాలా ప్రతిపాదనలు చేశాం. కానీ తొలి నుంచీ వారు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అప్పుడే మేం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం' అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. సీట్ల పంపకాల విషయంలో తృణమూల్‌తో చర్చలు జరుగుతున్నట్లు రాహుల్ గాంధీ అసోంలో ప్రకటించిన వేళ దీనిపై మమతా బెనర్జీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ ఈ విషయంపై మాట్లాడలేదన్నారు. 300 స్థానాల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేయాలని, మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తాయని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ జోక్యాన్ని సహించబోమని తెలిపారు.
'రాహుల్ ప్రభావం ఉండదు'
ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రపై తమకు సమాచారం లేదని మమత తెలిపారు. బంగాల్ నుంచి రాహుల్ యాత్ర సాగుతున్నా సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఆ యాత్ర వివరాలు తనకు తెలియజేసే మర్యాద ఆ పార్టీకి లేదా అని ప్రశ్నించారు. రాహుల్ ప్రభావం పెద్దగా ఉండబోదన్నారు.
రాహుల్ యాత్రలో టీఎంసీ పాల్గొనే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి యాత్రకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని టీఎంసీ తెలిపింది. ఒకవేళ అందినా వెళ్లే అవకాశాలు తక్కువేనని స్పష్టం చేసింది.
మమత మాకు ముఖ్యమే: కాంగ్రెస్
మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. మమతా బెనర్జీ లేకుండా ఇండియా కూటమిని ఊహించుకోలేమని పేర్కొంది. కూటమికి టీఎంసీ మూలస్తంభం లాంటిదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ జోడో యాత్ర బంగాల్‌లోకి ప్రవేశిస్తుందని, సీట్ల పంపకానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.
'క్లిష్టమైన ప్రక్రియే, కానీ పరిష్కారం లభిస్తుంది'
రాష్ట్రస్థాయిలో ఒకరిపై ఒకరు పోరాటం చేసే టీఎంసీ, కాంగ్రెస్, వామపక్షాల మధ్య బంగాల్‌లో సీట్ల సర్దుబాటు కాస్త క్లిష్టమైన ప్రక్రియేనని దిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. అయితే, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగాల్‌లో టీఎంసీ పెద్ద పార్టీ అని పేర్కొన్న ఆయన- ఇండియా కూటమిని విజయతీరాలకు చేర్చేందుకు మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని చెప్పారు. కూటమిలోని అన్ని పార్టీలు ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.