India Alliance Punjab AAP :దేశంలో అధికార బీజేపీపై లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పోటీచేసి గద్దె దించేందుకు పూనుకున్న విపక్షాల ఇండియా కూటమిలో బీటలు వారినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించగా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరో కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి పొత్తు లేదని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. పంజాబ్‌లో ఆప్ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 13 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు భగవంత్ మాన్.
"దేశంలో 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 13 స్థానాలు గెలుస్తుంది. ఉన్నతస్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయి. కానీ పంజాబ్‌లో అలాంటిదేమీ లేదు. మేం కాంగ్రెస్‌తో వెళ్లడంలేదు."
-- భగవంత్ మాన్, పంజాబ్ ముఖ్యమంత్రి
అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు సీఎం భగవంత్ మాన్. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని తేల్చిచెప్పారు. పొత్తులపై కాంగ్రెస్‌తో జరుగుతున్న చర్చలకు పంజాబ్‌తో సంబంధంలేదని ఆయన చండీగఢ్‌లో వివరించారు. సార్వత్రిక ఎన్నికల కోసం దిల్లీ, పంజాబ్, హరియాణా, గోవా, గుజరాత్‌లో సీట్ల పంపకాలపై ఆప్, కాంగ్రెస్ మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలో భగవంత్ మాన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
సీట్ల సర్దుబాట్లలో విభేదాల వల్లే!
అంతకుముందు మమతా బెనర్జీ ఇదే ప్రకటన చేశారు. సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్‌తో తాము సంప్రదింపులు జరపడం లేదని తెలిపారు. బంగాల్ వరకు సార్వత్రిక ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, జాతీయస్థాయిలో పొత్తుపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే సీట్ల సర్దుబాటులో విభేదాల వల్లే ఇండియా కూటమికి బీటలు పడుతున్నట్లు తెలుస్తోంది.
మమతా బెనర్జీ ఇంకా విపక్ష ఇండియా కూటమిలోనే ఉన్నట్లు భావిస్తున్నామని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వెల్లడించింది. మమత ప్రతిపక్ష కూటమిలో కీలక భాగస్వామని చెప్పింది. దీదీపై తమకు అపారమైన గౌరవం ఉందని ఎన్సీపీ కార్యనిర్వహక అధ్యక్షురాలు సుప్రియా సూలే వెల్లడించారు. ఇండియా కూటమి ఐక్యంగా ఉందని తామందరం కలిసే పోరాడతామని స్పష్టం చేశారు. కూటమిలో అంతర్గత పోరు లేదని తేల్చి చెప్పిన సుప్రియో సూలే, రాష్ట్రాల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని తెలిపారు.