INDIA Alliance Meet On Poll Performance : విపక్ష ఇండియా కూటమిలోని పార్టీల ముఖ్య నేతలు జూన్ 1న(శనివారం) మధ్యాహ్నం దిల్లీలో సమావేశం కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు కనబర్చిన పనితీరును సమీక్షించుకునేందుకు ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తుది విడత పోలింగ్ జరుగుతున్న జూన్ 1వ తేదీనే ఇండియా కూటమి పార్టీలు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఉందని పరిశీలకులు అంటున్నారు. మీటింగ్‌కు హాజరుకావాలంటూ అన్ని పార్టీలకు ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సందేశాన్ని పంపారని తెలిసింది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఆ తేదీకి సరిగ్గా మూడు రోజుల ముందు జరుగుతున్న ఇండియా కూటమి సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
కేజ్రీవాల్ సరెండర్‌కు ఒకరోజు ముందు
ఏడు విడతల పోలింగ్ ఘట్టంపై ఇండియా కూటమి పార్టీలు పెట్టుకున్న అంచనాలు ఏమిటి ? అనే దానిపై జూన్ 1న మీటింగ్ వేదికగా ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఏ పార్టీలు హాజరవుతాయి? ఏవి హాజరుకావు? అనేది కూడా వేచిచూడాలి. ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలకు దూరంగా ఉండిపోయిన మమతా బెనర్జీ ఈ కీలక సమావేశానికి హాజరవుతారా, లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తీహాడ్ జైలు అధికారుల ఎదుట లొంగిపోనున్నారు. ఇది జరగడానికి సరిగ్గా ఒకరోజు ముందే ఇండియా కూటమి మిత్రపక్షాలు భేటీ అవుతుండటం గమనార్హం.