Hyderabad to Vijayawada TSRTC Buses :ఈ వేసవి కాలంలో విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్‌లో వెళ్లే ప్రయాణికులకోసం ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేసినట్లు TSRTC ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతిరోజూ 120కి పైగా బస్సులు నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ బస్సులలో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ బస్సులు 62 ఉన్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలియజేసింది. అలాగే ప్రయాణికులకు మరొకగుడ్‌న్యూస్ కూడా TSRTC చెప్పింది. అది ఏంటంటే.. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి టికెట్‌పై 10 శాతం రాయితీని సంస్థ కల్పించింది. తిరుగు ప్రయాణానికి టికెట్ బుకింగ్ చేసుకుంటే కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని చెప్పింది. ప్రయాణికులు ఎవరైనా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ టికెట్లను బుకింగ్ చేసుకోవాలనుకుంటే.. అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలని కోరింది.
బెంగళూరు వెళ్లే వారికీ గుడ్‌న్యూస్..
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు కూడా టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ రూట్‌లో ప్రయాణించే వారు ముందస్తు రిజర్వేషన్‌చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తామని తెలిపింది. ఈ రాయితీ అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ వర్తిస్తుందని ప్రకటించింది. కాబట్టి, బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.