Why Congress Lost The Elections :హరియాణాలో కాంగ్రెస్ పార్టీ చేతికి అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను సీట్లుగా మార్చుకోవడంలో విఫలమైంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజారిటీని సాధించలేక చతికిలబడిపోయింది. అలాగే జమ్ముకశ్మీర్లో కూడా కాంగ్రెస్ ఆశించినర మేర ఫలితాలు సాధించలేకపోయింది. అందుకు గల కారణాలేంటి? కాంగ్రెస్ను దెబ్బతీసిన అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చీలిన ఓట్లు- లాభపడిన బీజేపీ
తొలుత హరియాణాలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి బరిలోకి దిగాలని భావించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ను ఆప్ 9 స్థానాలు అడగ్గా, అందుకు హస్తం పార్టీ తిరస్కరించింది. దీంతో ఆప్ ఒంటిరిగానే పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చింది. ఒకటిన్నర శాతానికి పైగా ఓట్లను ఆప్ ఈ ఎన్నికల్లో సాధించింది. దీంతో బీజేపీ లాభపడింది. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల అంతరం 1శాతం లోపే. ఒకవేళ కాంగ్రెస్, ఆప్ పొత్తుతో బరిలో దిగి ఉంటే ఫలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా ఉండేవని వాదనలు వినిపిస్తున్నాయి.