Firing On Rape Victim : తనపై పెట్టిన రేప్ కేసు వెనక్కి తీసుకోవడం లేదన్న కోపంతో బాధితురాలిపై దారుణంగా దాడి చేశాడు ఓ నిందితుడు. తన స్నేహితులతో కలిసి బాధితురాలు, ఆమె సోదరుడిపై తుపాకీ, పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రైలు ఢీకొని కాలును పోగొట్టుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ జైపుర్‌లో జరిగింది.
ఇదీ జరిగింది
రాజేంద్ర యాదవ్ అనే వ్యక్తిపై ఓ యువతి 2023 జూన్‌లో అత్యాచారం కేసు పెట్టింది. నిందితుడు తనను అత్యాచారం చేసి, ఆ ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తానంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే, రెండు నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు, కేసును వెనక్కి తీసుకోకపోతే చంపేస్తానంటూ బాధితురాలి కుటుంబాన్ని బెదిరించాడు. దీంతో భయపడిన నిందితురాలు, తనకు రక్షణ ఇవ్వాలంటూ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు.
ఈ క్రమంలోనే శనివారం సోదరుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న బాధితురాలిని, తన స్నేహితులు మహిపాల్, రాహుల్‌తో కలిసి అడ్డగించాడు రాజేంద్ర. పదునైన ఆయుధాలు, తుపాకీతో వారిపై దాడి చేశారు. బాధితురాలిపై తుపాకీతో కాల్పులు జరిపి, ఆయుధంతో గాయపరిచారు. ఈ దాడిలో బాధితురాలి సోదరుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. బుల్లెట్ గాయాలపాలైన బాధితురాలు, అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమె చనిపోయిందని భావించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, బాధితురాలు సహా ఆమె సోదరుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి జైపుర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసిన వైద్యులు, బాధితురాలి శరీరం నుంచి బుల్లెట్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఆమె సోదరుడు సైతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.