తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కార్పొరేట్లు కాదు, మా గురించి ఆలోచించండి'- ఎంఎస్​పీపై ఆర్డినెన్స్​కు రైతుల డిమాండ్ - farmer talks with government

Farmers Demand On MSP : కేంద్ర ప్రభుత్వం ఎంఎస్​పీకి చట్టపరమైన హామీ కోసం ఆర్డినెన్స్​ను తీసుకురావాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అలాగే కేంద్రం కార్పొరేట్లపై దృష్టి తగ్గించి రైతుల గురించి ఆలోచించాలని కోరారు.

Farmers Demand On MSP
Farmers Demand On MSP

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 3:54 PM IST

Farmers Demand On MSP :కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లపై కొంచెం తక్కువగా దృష్టి సారించి, కర్షకుల గురించి ఆలోచించాలని అన్నారు రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్​. వినియోగదారుడు, ఉత్పత్తిదారులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పంజాబ్- హరియాణా సరిహద్దులో శంభు వద్ద రైతు నాయకులు మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్​పీకి చట్టపరమైన హామీ ఇవ్వడంపై కేంద్రం ఆర్డినెన్స్​ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై రైతు నాయకులు ఆదివారం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్న ఒకరోజు ముందే ఎంఎస్​పీపై ఆర్డినెన్స్​ను డిమాండ్ చేయడం గమనార్హం.

కేంద్రం ఆర్డినెన్స్ తేవాలనుకుంటే రాత్రికి రాత్రే తీసుకురావచ్చని అన్నారు రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్​. ప్రభుత్వం రైతుల నిరసనలకు పరిష్కారం కోరుకుంటే వెంటనే ఎంఎస్​పీపై చట్టం చేసేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు ప్రభుత్వంతో ఎంఎస్​పీపై చర్చలు మరింత ముందుకు సాగుతాయని చెప్పారు. ఏదైనా ఆర్డినెన్స్‌కు ఆరు నెలల చెల్లుబాటు ఉంటుందని పేర్కొన్నారు.

"రుణమాఫీ మొత్తం ఎంతో అంచనా వేయాలని ప్రభుత్వం చెబుతోంది. బ్యాంకుల నుంచి ప్రభుత్వం సులువుగా డేటాను సేకరించవచ్చు. కేంద్రం 23 పంటలకు ఎంఎస్‌పీ ప్రకటించింది. కానీ 2-3 పంటలను ఎంఎస్​పీ ధరకు కొంటోంది. మేము మొదటి దశగా పంటల కొనుగోలులో కార్పొరేట్ల దోపిడిని అంతం చేయాలనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎస్​పీపై ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. కేంద్ర కేబినెట్ తలచుకుంటే పంటల కొనుగోలుకు చట్టపరమైన హామీపై ఆర్డినెన్స్ చేయవచ్చు."
--సర్వన్ సింగ్ పంధేర్​, రైతు నాయకుడు

బీజేపీ నాయకుల ఇళ్ల ముందు ఆందోళనలు
మరోవైపు, పంజాబ్​లో బీజేపీ నేతల ఇళ్ల ముందు కొందరు రైతు నాయకులు నిరసనలు చేపట్టారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్​, రాష్ట్ర బీజేపీ చీఫ్ సునీల్ జాఖడ్​, కేవల్ సింగ్ ధిల్లాన్ ఇంటి ముందు నిరసనలు చేపట్టారు. మరో రెండు రోజులు ఈ నేతల ఇంటి ముందు ఆందోళనలు చేపడతామని రైతు నాయకులు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ నేతల ఇళ్ల ముందు మరింత భద్రతను పెంచారు.

కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, రైతులకు పింఛను, పంటబీమా, 2020 ఆందోళనల్లో కర్షకులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్‌ చేస్తూ కొద్ది రోజులుగా రైతులు నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు నాయకులతో పలుమార్లు చర్చలు జరిపింది. అయినా చర్చలు సానుకూల ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల ఆదివారం మరోసారి రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది.

రైతులతో కేంద్రం మూడో విడత చర్చలు- శుక్రవారం భారత్ బంద్- ఇంటర్నెట్ బ్యాన్ పొడగింపు

'పాజిటివ్'గానే సాగాయ్​- కానీ మరోసారి రైతులతో చర్చలు : కేంద్రం

ABOUT THE AUTHOR

...view details