Expensive Number Plates In India: ఈ మధ్య కాలంలో వాహనాల నంబరు ప్లేట్లపై ఆసక్తి పెరుగుతోంది. అందరి కంటే భిన్నంగా ఉండాలని, కొంతమంది ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల కోసం పోటీ పడుతున్నారు. అందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడట్లేదు. కొందరైతే కారు కంటే నంబర్ ప్లేట్స్‌ను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు తమకు నచ్చిన నంబర్ ప్లేట్ల కోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నారు.
గతేడాది ఏప్రిల్లో దుబాయ్‌లో రూ.122 కోట్లకు అమ్ముడైన 'పి7' నంబర్ ప్లేట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. దీనిని దుబాయ్‌లోని ఓ వ్యాపారవేత్త ఎమిరేట్స్ వేలంలో కొనుగోలు చేశారు. దీని వల్ల వచ్చిన ఆదాయం దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్‌కు చెందిన బిలియన్ మీల్స్ ఎండోమెంట్ అనే గ్లోబల్ పుడ్ సంస్థకు సాయం చేశారు. దుబాయ్‌లోనే కాదు, భారత్‌లోనూ కొంత మంది భారీ మొత్తాల్లో వెచ్చించి నచ్చిన నంబర్ ప్లేట్స్ తీసుకున్నారు. వారేవరో చూద్దాం.
'07' కోసం రూ.34 లక్షలు
2020లో గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన ఆశిక్ పటేల్ అనే వ్యక్తి రూ.39.5 లక్షలు వెచ్చించి టయోటా ఫార్చునర్ కారును కొనగోలు చేశారు. కానీ '07' అనే నంబర్ ప్లేట్ కోసం రూ.34 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ నంబర్ తనకు అదృష్టమని అందుకే కొనుగోలు చేశానని ఆశిక్ పటేల్ తెలిపారు.
'0001' కోసం రూ.31 లక్షలు
కేరళకు చెందిన కే.ఎస్ బాలగోపాల్ అనే వ్యక్తి పోర్షే 718 బాక్స్‌స్టర్ వాహనం కోసం రూ.31 లక్షలు ఖర్చు చేసి రిజిస్ట్రేషన్ ప్లేట్ తీసుకున్నారు. 'కేఎల్ 01 సీకే 0001' నంబర్ ప్లేట్ కోసం ఇంత మొత్తాన్ని అతడు వెచ్చించారు. రిజిస్ట్రేషన్ నంబర్ కోసం రూ. 30 లక్షలు, రిజర్వేషన్ ఫీజుగా లక్ష రూపాయలు చెల్లించారు. అయితే కారు ఖరీదు రూ.90 లక్షలు. ఈ నెంబర్ ఎంతో ప్రత్యేకమైనదని, అందుకే అంత ఖర్చు పెట్టి కొనుగోలు చేశారని బాలగోపాల్ తెలిపారు. 2017లో టయోటా ల్యాండ్ క్రూయిజ్‌కు ఇదే రిజిస్ట్రేషన్ నంబర్ కోసం రూ.19 లక్షలు చెల్లించారు.