Emmanuel Macron India Visit :రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రధాని మోదీతో కలిసి రాజస్థాన్‌లో రోడ్‌షోలో పాల్గొన్నారు. జయపురలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన జంతర్ మంతర్ నుంచి సంగనేరి గేట్ మోదీతో కలిసి రోడ్‌షో చేశారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి జయపురలోని హవా మహల్‌ను సందర్శించారు మెక్రాన్. ఈ క్రమంలో మెక్రాన్‌కు యుపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ గురించి ప్రధాని మోదీ వివరించారు.
అంతకుముందు జయపుర చేరుకున్న మెక్రాన్ అక్కడ ఉన్న ఆమెర్ కోటను సందర్శించారు. ఆమెర్ కోటలో అధికారులు, స్కూల్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఆ సమయంలో ఆయన వెంట కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, రాజస్థాన్ డిప్యూటీ సీఎం దియా కుమారి ఉన్నారు.
ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు గురువారం జరిగే గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు మెక్రాన్ భారత్‌కు వచ్చారు. ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌లోని జయపురకు విచ్చేసిన మెక్రాన్‌కు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, సీఎం భజన్‌లాల్ శర్మ స్వాగతం పలికారు. శుక్రవారం దిల్లీలో జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల్లో మెక్రాన్ పాల్గొననున్నారు.
Republic Day 2024 Chief Guest :ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు తొలుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించగా, వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేనని బైడెన్ చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యయేల్ మెక్రాన్‌ను ఆహ్వానించగా ఆయన అంగీకరించారు. గతేడాది జులైలో పారిస్‌లో నిర్వహించిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ 'బాస్టిల్ డే' పరేడ్‌లో ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బాస్టిల్ పరేడ్ అనంతరం ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై విస్త్రృతంగా చర్చించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని దేశ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్' అవార్డుతో మోదీని ఫ్రాన్స్ సత్కరించింది.