Elections Poll Strategist India : రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలు కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు ప్రాచుర్యంలోకి రాకముందు ఆయా పార్టీల అగ్రనేతలు రాష్ట్ర, దేశవ్యాప్త పర్యటనలు చేపట్టి ఓటర్ల నాడిని పసిగట్టేవారు. ప్రాంతాలవారీగా వ్యూహాలు రచించుకొని ఓటర్లను ఆకర్షించేందుకు తాయిలాలు సహా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై హామీలిచ్చేవారు. గతంలో ఎల్కే అడ్వాణీ వంటి నేతలు దేశవ్యాప్త యాత్రలు చేపడితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదట వైెఎస్ రాజశేఖర్ రేడ్డి, తర్వాత చంద్రబాబు పాదయాత్రల ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి ఎన్నికల్లో విజయాలను అందుకున్నారు.
కార్యర్తలకు దిశానిర్దేశం
2014నాటి సార్వత్రిక ఎన్నికల సమయానికి సామాజిక మాధ్యమాల ప్రభావం భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్తలు కూడా రంగ ప్రవేశం చేశారు. తమను నియమించుకున్న పార్టీల గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలకు పదును పెట్టి వాటిని పక్కాగా అమలు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నిర్దేశించుకున్న ప్రాంతాల్లో ప్రజల పల్స్ పట్టేందుకు సర్వేలు చేయడం, వారి సమస్యలు తెలుసుకోవడం, ఎన్నికల్లో ప్రభావితం చేసే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతం చేస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో సలహాలు, సూచనలు ఇవ్వడం, అవసరమైతే ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిలించేందుకు ఎత్తుగడలు వేయడం వ్యూహకర్తల కార్యకలాపాలుగా మారాయి. నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల సమాచారాన్ని సేకరించి పార్టీలకు అందించడం, ప్రచారానికి అవసరమైన కంటెంట్‌ను రూపొందించడం, వాటిని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు,కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. చదరంగం క్రీడాకారుల మాదిరిగా రాజకీయ నేతలను పావులుగా ముందుకు నడిపిస్తూ తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. గెలుపు లెక్కలను పక్కాగా వేస్తూ పార్టీలు, అభ్యర్థుల గెలుపులో తెరవెనుక పాత్ర గట్టిగా పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం విరివిగా వాడుకుంటున్నారు.
పలు పార్టీల కోసం ప్రశాంత్ కిశోర్
2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వంటి వ్యూహకర్తలు రాజకీయ వ్యూహ క్షేత్రంలోకి దూసుకొచ్చారు. 2014లో బీజేపీకి వ్యూహరక్తగా వ్యవహరించిన పీకే, నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి కావడం వెనుక అనేక వ్యూహాలు రచించి, సఫలీకృతమయ్యారు. చాయ్ పే చర్చ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉద్యమం చేపట్టడం సహా మోదీ అభివృద్ధి సాధకుడు అనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 సీట్లు గెలిచి కొన్నేళ్లుగా నడిచిన సంకీర్ణ ప్రభుత్వాల పరంపరకు తెరదించింది. 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పిన పీకే తర్వాత దానిని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ-I-PACగా మార్చారు. తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా, బిహార్‌లో జేడీయూ, బంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీల కోసం పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత I-PAC నుంచి ప్రశాంత్ కిశోర్ తప్పుకున్నప్పటికీ ఆ సంస్థ పలు పార్టీల కోసం పని చేస్తూనే ఉంది.
కాంగ్రెస్ గెలుపులో సునీల్ కీలకపాత్ర
గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పని చేసిన ఆయన ఆ పార్టీ ఘన విజయం అందుకోవడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్ కోసం పనిచేసి విజయవంతమయ్యారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కోసం వ్యూహరచనలో ఉన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర సైతం సునీల్ కనుగోలు వ్యూహంలో భాగమే. గతంలో ఆయన పలు రాష్ట్రాల్లో బీజేపీ కోసం కూడా పనిచేశారు. ఎన్నికల సర్వే సంస్థ చాణక్య నిర్వాహకుడు పార్థ ప్రతిమ్ దాస్ 2013లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అజయ్ సింగ్ అనే అభ్యర్థి గెలిచేందుకు వ్యూహాలు రచించి సఫలీకృతమయ్యారు. ఆయన బీజేపీ సిట్టింగ్ ఎంపీపై విజయం సాధించారు. తర్వాత చాణక్యను ఏర్పాటుచేసిన దాస్, 2018 ఎన్నికల్లోనూ అజయ్ సింగ్ గెలుపు కోసం పనిచేశారు.