ED Raids In Ranchi : లోక్‌సభ ఎన్నికల వేళ ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం పీఏ పనిమనిషి ఇంట్లో రూ.25 కోట్ల నగదును జప్తు చేశారు ఈడీ అధికారులు. ఈ డబ్బు మంత్రి పీఏ సంజీవ్ లాల్‌కు చెందినదని పని మనిషి జహీంగీర్ ఆలం ఈడీ అధికారుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది.
మనీలాండరింగ్ కేసు విషయంలో రాంచీలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్ మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో భాగంగా ఈడీ అధికారులు మంత్రి పీఏ పనిమనిషి ఇంట్లో సోదాలు జరిపారు. ఈ క్రమంలో అతడి ఇంటి నుంచి రూ.25 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అసలేంటీ కేసు?
రాంచీలోని గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుని వారికి పనులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈడీ వీరేంద్ర కుమార్ ఇంటిపై దాడులు నిర్వహించి భారీగా నగదును స్వాధీనం చేసుకుంది. అంతేగాక ఈ అక్రమ ధనాన్ని వీరేంద్ర కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఉపయోగించిందని ఈడీ అప్పట్లో పేర్కొంది. ఝార్ఖండ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఫిర్యాదు మేరకు వీరేంద్రపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి 2023 ఫిబ్రవరిలో అరెస్ట్ చేసింది.