Woman Body Found In Fridge :శ్రద్ధావాకర్ హత్య తరహా మరో దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. 30కిపైగా ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్లో కుక్కారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మృతురాలిని మహాలక్షిగా గుర్తించినట్లు, ఆమె మృతదేహం ఛిద్రమైన స్థితిలో లభ్యమైనట్లు పోలీసు వర్గాలు శనివారం తెలిపాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వయాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు మహాలక్షికి(29) ఇది వరకే పెళ్లైంది. వ్యక్తిగత కారణాలతో తన బిడ్డతో పాటు మునేశ్వరనగర్లో ఐదు నెలలుగా ఒంటరిగా నివాసం ఉంటోంది. తన భర్త హుకుమ్ సింగ్ నేలమంగళలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలికి, ఆమె తల్లి, కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం వల్ల అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూడగా, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ లేబరేటరీ బృందం ఘటనాస్థలిని పరిశీలించారు.
అయితే కొద్దిరోజుల క్రితం మహిళ హత్యకు గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికి ఫ్రిజ్లో పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్వాసన రాకుండా రసాయనాలు చల్లి ఇంటికి తాళం వేసి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే బాధితురాలి ఫోన్ సెప్టెంబర్ 2న అయిందని, అదే రోజు హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.