Delhi Heavy Rains :దేశ రాజధాని దిల్లీలో వాన దంచికొట్టింది. రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ తప్పనిసరి ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. గాజిపూర్ కాల్వలో పడి తల్లీబిడ్డ మృతిచెందగా, సబ్జీమండిలో ఓ ఇల్లు కూలి పలువురు గాయపడ్డారు. రోడ్లపై పెద్దమొత్తంలో వాననీరు నిలవటం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 10విమానాలను దారి మళ్లించారు. అటు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణాతోపాటు కర్ణాటకలోని కొన్నిచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి.
బుధవారం సాయంత్రం నుంచి కురుకుస్తున్న కుండపోత వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కన్నాట్ ప్లేస్, కుతుబ్ మినార్, లుటియన్స్ దిల్లీ, కశ్మీర్‌గేట్, కరోల్ బాగ్, ప్రగతిమైదాన్, ITO, ఎయిమ్స్, మాన్సింగ్ రోడ్, మింటోరోడ్, పార్లమెంట్, నౌరోజి నగర్‌సహా అనేకప్రాంతాల్లో వాననీరు నిలిచిపోయింది. చాలాచోట్ల నడుములోతు వరకు వాననీరు నిలవటం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా దిల్లీవాసులు అర్ధరాత్రైనా ఇళ్లకు చేరుకోలేకపోయారు.
వరద తీవ్రత దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు చాలా మార్గాల్లో రాకపోకలను నిలిపేశారు. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వరద తీవ్రత, వాతావరణ విభాగం హెచ్చరికలతో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అనవసర ప్రయాణాలు చేయద్దని ప్రజలకు సూచించింది. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా దిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు.
వానలోనే ఆందోళనలు
గాజిపూర్‌లో కాల్వలో ఓ మహిళ, ఆమె మూడేళ్ల బాలుడు మృతిచెందారు. భారీ వర్షానికి సబ్జీమండిలో ఓ ఇల్లుకూలింది. 5 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల నుంచి ఒకరిని బయటకుతీసి, ఆస్పత్రికి తరలించారు.