Delhi Next CM Sunitha Kejriwal : మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జ్యుడిషియల్ కస్టడీ విధించి తీహాడ్ జైలుకు తరలించారు. ఈడీ కస్టడీలో లాగా జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ దిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆ బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. దిల్లీ ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు ఎవరూ అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే తెరపైకి కొంత మంది పేర్లు వస్తున్నా, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
మరో రబ్రీదేవీ?
దిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం మొట్టమొదట వినిపిస్తున్న పేరు సునీతా కేజ్రీవాల్. అయితే ఇప్పటి వరకు రాజకీయాలను దూరంగానే ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌తో సునీతా తెరపైకి వచ్చింది. భర్త తరఫున మాట్లాడుతూ, బీజేపీపై విమర్శలు చేయటం వంటివి చేశారు. దీంతో తదుపరి దిల్లీ సీఎంగా బాధ్యతలు చేపడతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయంపై అవినీతి కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు జైలు శిక్ష విధించడం వల్ల ఆయన భార్యను సీఎం పగ్గాలు చేపట్టినట్లు సునీతా కేజ్రీవాల్ కూడా చేపడతారని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు.
అర్హతలు ఉన్నాయా?
మరో వైపు సునీతా కేజ్రీవాల్‌కు సీఎం బాధ్యతలు చేపట్టే అర్హతలు ఉన్నాయా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఐఆర్ఎస్ అధికారిణిగా విధులు నిర్వర్తి పదవీ విరమణ చేశారు. ఉన్నత చదువులు చదివారు, ప్రస్తుతం ప్రజల్లోనూ మంచి ఆదరణ ఉంది. ఎన్నికల ప్రచారల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ తర్వాత ముఖ్య నేతలుగా ఉన్న మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ కూడా జైలులో ఉన్నారు. దీంతో తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.