Delhi Case Kejriwal :లిక్కర్ స్కామ్ కేసులో తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లను తెగ తినేస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రౌస్ అవెన్యూ కోర్టుకు గురువారం తెలిపింది. "టైప్ 2 మధుమేహం ఉందనే విషయం తెలిసినప్పటికీ బెయిల్ కోసం సాకును సృష్టించడానికి రోజూ ఇంటి నుంచి మామిడి పండ్లు, స్వీట్లను తెప్పించుకుని మరీ కేజ్రీవాల్ తింటున్నారు. చక్కెరతో కూడిన టీ తాగుతున్నారు. ఆలూ పూరీ తింటున్నారు" అని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. బ్లడ్ షుగర్ పెరిగితే బెయిల్ అడగాలనేది కేజ్రీవాల్ ప్రణాళిక అని ఆరోపించింది.
'షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయ్'
"నా షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి. క్రమం తప్పకుండా వాటిని తనిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నా వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతి ఇవ్వండి" అంటూ తాజాగా కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, జైలులో కేజ్రీవాల్ పాటిస్తున్న డైట్ ఛార్ట్‌ను తమకు సమర్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. తదుపరి వాదనలు శుక్రవారం వింటామని తెలిపింది. మరోవైపు, ఈడీ వాదనను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ కొట్టిపారేశారు. ఈడీ చేసేవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమేనని ఆయన కోర్టుకు తెలిపారు.
కేజ్రీవాల్‌ను చంపడానికి కుట్ర : అతిషి
బ్లడ్ షుగర్‌ను పెంచుకునేందుకే కేజ్రీవాల్ తీపి పదార్థాలను తింటున్నారని ఈడీ చేసిన ఆరోపణలపై ఆప్ సీనియర్ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ స్పందించారు. కేజ్రీవాల్‌కు ఇంటి ఆహారాన్ని ఆపేసి, వైద్య చికిత్సకు అనుమతిని నిరాకరించి చంపేయడానికి కుట్ర జరుగుతోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేజ్రీవాల్ డైట్ గురించి కోర్టుకు ఈడీ అబద్ధాలు చెబుతోందన్నారు. కేజ్రీవాల్ కృత్రిమ స్వీటెనర్‌ను తీసుకుంటున్నారని ఈడీ వినిపిస్తున్న వాదనల్లో నిజం లేదని తేల్చిచెప్పారు.