Congress SP Alliance :వరుస షాక్‌లు తగులుతున్న ఇండియా కూటమికి ఊరట లభించింది. ఎట్టకేలకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లలో పోటీ చేయనుంది. మిగతా స్థానాల్లో ఎస్పీ, భాగస్వామ్య పక్షాలు బరిలో దిగనున్నాయి. ఈ పొత్తు వరుస దెబ్బల తర్వాత ఇండియా కూటమికి కాస్త ఊరట అని చెప్పాలి. అలాగే దిల్లీలోనూ ఆప్- కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిల్లీలో సీట్ల పంపకంపై ఆప్, కాంగ్రెస్ మధ్య చర్చలు చాలా ఆలస్యమయ్యాయని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆప్-కాంగ్రెస్ మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే పొత్తు గురించి ప్రకటిస్తామని చెప్పారు. 'వచ్చే 2-3 రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికే పొత్తుల ఖరారు చాలా ఆలస్యమైంది.' దిల్లీ సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.
యూపీలో కుదిరిన పొత్తు
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఎస్పీ- కాంగ్రెస్ కలిసి పోటీ చేయనున్నట్లు బుధవారం ప్రకటించాయి. యూపీలోని మొత్తం 80 స్థానాల్లో 17 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని, మిగతా స్థానాల్లో ఎస్పీ, ఇతర భాగస్వామ్య పక్షాలు పోటీచేస్తాయని వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ ఎస్పీ చీఫ్ నరేశ్ ఉత్తమ్ పటేల్, ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చౌదరి, యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రాయ్‌బరేలీ, అమేఠి, వారణాసి, కాన్పుర్ సిటీ, ఫతేపుర్ సిక్రీ సహా కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఖజురహో లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తుందని, మిగతా స్థానాల్లో కాంగ్రెస్క మద్దతిస్తుందని తెలిపారు.
తొలి నుంచి సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తును కోరుకుంటుందని ఎంపీ డింపుల్ యాదవ్ అన్నారు. కూటమిగా ఏర్పడినందుకు ఎస్పీ- కాంగ్రెస్ పార్టీలకు ఆమె అభినందించారు.' ప్రజలు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇండియా కూటమికి మద్దతు ఇస్తారు. ఎందుకంటే యువత, మహిళలు, రైతులు అందరూ బీజేపీ సర్కార్‌పై కోపంగా ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమికే ఓటేస్తారు' అని డింపుల్ యాదవ్ అన్నారు.