భరతమాత ముద్దుబిడ్డ, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు సాయంత్రం ముంబయిలో జరగనున్నాయి. ప్రస్తుతం NCPA మైదానంలో ఉన్న ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు అనేక మంది ప్రముఖులు, సామాన్యులు తరలివస్తున్నారు. సాయంత్రం వరకు పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
బుధవారం రాత్రి ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన రతన్ టాటా భౌతిక కాయాన్ని తొలుత దక్షిణ ముంబయిలోని కోలాబాలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. అక్కడ పలువురు ప్రమఖులు, టాటా గ్రూప్ ఉన్నతాధికారులు వెళ్లి నివాళులు అర్పించారు. మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కూడా ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
ఆ తర్వాత రతన్ టాటా పార్థివదేహాన్ని ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు. ప్రత్యేకంగా బ్యాండు, కవాతుతో పోలీసులు ఆయన్ను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రజల సందర్శనార్థం సాయంత్రం వరకూ NCPA గ్రౌండ్‌లోనే రతన్ టాటా భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. ఈ క్రమంలో NCPA గ్రౌండ్‌కు దారితీసే మెరైన్ డ్రైవ్ మార్గాన్ని పోలీసులు మూసివేశారు. అంతేకాకుండా ఆ దారిలో భద్రతా బలగాలను మోహరించారు.
మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో NCPA గ్రౌండ్ నుంచి రతన్ టాటా అంతిమయాత్ర జరగనుంది. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రతన్ టాటా మృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం నేడు సంతాప దినంగా ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను కూడా అవనతం చేశారు. అంతేకాకుండా ఈ రోజు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించరాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటనకు వెళ్లినందున భారత ప్రభుత్వం తరపున రతన్ టాటా అంత్యక్రియాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే నోయెల్ టాటాకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ, రతన్ టాటా మృతిపై విచారం వ్యక్తం చేశారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా టాటా మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.