Chandrayaan 4 And 5 Update :చంద్రుడిపై అన్వేషణలో భాగంగా అనేక ప్రయోగాలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో, అక్కడ నుంచి రాళ్లు, మట్టి తీసుకువచ్చే లక్ష్యంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 డిజైన్లు పూర్తైనట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ఇవి కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయని చెప్పారు. దిల్లీలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మీడియాకు చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఇస్రో దాదాపు 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుందని తెలిపారు.
"చంద్రుడిపై అన్వేషణ కోసం వరుస ప్రయోగాలు చేపడుతున్నాం. ఇప్పటికే చంద్రయాన్ 3 పూర్తయ్యింది. చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయి. రానున్న కాలంలో ఇస్రో మొత్తంగా 70 శాటిలైట్ ప్రయోగాలు చేపట్టనుంది. ఇందులో వివిధ శాఖల అవసరాల కోసం తక్కువ ఎత్తులో చేపట్టే నావిక్ (NAVIC) INSAT 4D, రిసోర్స్‌శాట్, కార్టోశాట్ వంటి ప్రయోగాలు ఉన్నాయి" అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. శుక్ర గ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు.